Sakshi News home page

ఆ దేశాధినేతలకు మన ‘ప్రాథమిక’ సందేశం

Published Fri, Jan 26 2018 2:35 PM

Ten ASEAN leaders attend Indian Republic Day celebrations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్‌ గణతంత్ర దినోత్సవం వేడుకలకు విశిష్ట అతిథులుగా ఆగ్నేయ ఆసియా దేశాల సంఘానికి చెందిన పది మంది నాయకులను ఆహ్వానించడం ఎంతో విశేషం. దీన్ని ప్రాంతీయ సహకారం దిశగా భారత్‌ వేస్తున్న ముందడుగుగా భావించవచ్చు. పైగా గత దశాబ్దకాలంగా ఈ దేశాలను తన వైపు తిప్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్న దశలో ఆ దేశాల అధినేతలను మన గణతంత్ర వేడుకలకు ఆహ్వానించడం ఎంతో ముదావహం.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్న విషయం తెల్సిందే. అమెరికా, బ్రిటన్, రష్యాలాంటి రాజ్యాంగాలతోపాటు ‘ఫ్రెంచ్‌ విప్లవం’ను ప్రధాన స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ నాయకత్వంలోని  భారత రాజ్యాంగ పరిషత్తు దీన్ని రూపొందించింది. ఫ్రెంచ్‌ విప్లవం నుంచి స్ఫూర్తిగా తీసుకొని రూపొందించినవి ప్రాథమిక హక్కులు. అందులో ప్రధానమైనది భావ ప్రకటనా స్వాతంత్య్రం. దీన్ని ఇప్పుడు పత్రికా స్వేచ్ఛగా కూడా పరిగణిస్తున్నాం.

ఆగ్నేయాసియా దేశాల నుంచి హాజరైన నాయకుల్లో ఎక్కువ మంది తమ దేశాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛను అణచి వేస్తున్నవారే. మన దేశంలో కూడా అప్పుడప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడి మనం భావ ప్రకటనా స్వేచ్ఛను నిలబెట్టుకుంటున్నాం. వివాదాస్పదమైన ‘పద్మావత్‌’ చిత్రం విడుదలను అడ్డుకునేందుకు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ప్రయత్నించడం రాజ్యాంగం ప్రకారం మనకు సంక్రమించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. ఈ నాలుగు రాష్ట్రాల్లో నిషేధాన్ని సుప్రీం కోర్టు కొట్టివేయడం ద్వారా మన స్వేచ్ఛను రక్షించింది.

సొహ్రాబుద్దీన్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసును విచారిస్తున్న జడ్జీ లోయా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పట్ల దాఖలైన పిటిషన్‌ విచారణకు ముంబై జర్నలిస్టులను ట్రయల్‌ కోర్టు అనుమతించలేదు. వారు దీన్ని హైకోర్టులో సవాల్‌ చేయడం ద్వారా విజయం సాధించారు. సోహ్రాబుద్ధీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఇదివరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. పత్రికా స్వేచ్ఛ విషయంలో ఆగ్నేయ ఆసియా దేశాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి.

లావోస్‌ 2014లో కఠినమైన సైబర్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు అంత కఠినమైన చట్టం అవసరం లేదని ప్రపంచ దేశాలు విమర్శించాయి. అదే తరహాలో అక్కడి ఆంగ్ల పత్రిక ‘కాంబోడియా డెయిలీ’ విమర్శించింది. ప్రధాన మంత్రి హన్‌ సెన్‌ బహిరంగంగా ఆ పత్రికను తీవ్రంగా విమర్శించారు. ఆ రోజు నుంచి పన్నుల నోటీసుల పేరిట ప్రభుత్వం వేధించడంతో కొన్ని రోజుల్లోనే ఆ పత్రిక మూత పడింది. ప్రధాని అణచివేత ధోరణులను భరించలేక అనేక స్వచ్ఛంద సంస్థలు దేశం విడిచిపోయాయి.

మలేసియా, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో కూడా స్వతంత్ర పత్రికలు, వెబ్‌సైట్లు ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొంటున్నాయి. మలేసియాకు చెందిన ‘మలేసియాకిని’పై భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేసి కోలుకోకుండా చేస్తున్నారు. రాజ్యాంగేతర హత్యలను ప్రశ్నించినందుకు ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం తక్షణం ‘ర్యాప్లర్‌’ పత్రికను మూసేయాల్సిందిగా ఆదేశించింది. మయన్మార్‌లో రోహింగ్య జాతి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును విమర్శించినందుకు ఆంగ్‌సాక్‌ సూచీ ప్రభుత్వం ఇద్దరు ‘రాయటర్స్‌’ జర్నలిస్టులపై కఠినమైన  ప్రభుత్వ రహస్య చట్టం కింద కేసులు పెట్టి వేధిస్తోంది. భారత గణతంత్ర వేడుకులకు విశిష్ట అతిథులుగా వచ్చిన ఆగ్నేయాసియా దేశాధినేతలు ఏ ఉద్దేశంతో వచ్చినా భారత రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకుంటే వారి రాకకు సార్థకత చేకూరుతుంది.

Advertisement
Advertisement