యూనివర్సిటీ అనే పదం వాడుకోరాదు | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీ అనే పదం వాడుకోరాదు

Published Tue, Nov 14 2017 2:38 AM

The term university should not be used, says UGS - Sakshi

సాక్షి, అమరావతి : దేశంలోని డీమ్డ్‌ యూనివర్సిటీలుగా ఉన్న సంస్థలు విశ్వవిద్యాలయాలు(యూనివర్సిటీలు)గా పేర్కొంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఇకపై అవి యూనివర్సిటీలుగా కాకుండా డీమ్డ్‌ వర్సిటీలుగానే తమ పేర్లను స్పష్టంగా పేర్కొనాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఆదేశిం చింది. ఈ మేరకు ఆయా డీమ్డ్‌ యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లకు, డైరెక్టర్లకు లేఖ రాసింది. ఇటీవల సుప్రీంకోర్టులో ఒక కేసులో విచారణ సందర్భంగా ఈ సంస్థలు డీమ్డ్‌ యూనివర్సిటీలుగా కాకుండా యూనివర్సిటీల పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించిందని యూజీసీ పేర్కొంది.

ఇకపై ఆయా సంస్థలు యూనివర్సిటీలుగా పేరును వాడరాదని, డీమ్డ్‌ యూనివర్సిటీలుగానే తమ కార్యకలాపాలు సాగించాలని స్పష్టంచేసింది. దేశంలో ఇలాంటి సంస్థలు 123 ఉన్నాయని గుర్తించామంటూ.. వాటి వివరాలను తన లేఖలో పొందుపరిచింది. వీటిలో ఐదు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఉన్నాయి. విశాఖపట్నంలోని గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌(గీతం), గుంటూరు జిల్లాలోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్, తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్, అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్, గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఉన్నాయి. 

Advertisement
Advertisement