పోలీస్‌లను కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు | Sakshi
Sakshi News home page

పోలీస్‌లను కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు

Published Fri, Aug 31 2018 2:31 PM

Terrorists Kidnapped Police Men Family Members - Sakshi

శ్రీనగర్ : పోలీసులతో పాటు వారి కుటుంబాలకు చెందిన 11 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. రెండు రోజుల క్రితం పోలీసులు తమ కుటుంబీకుల ఇండ్లపై దాడి చేసిన నేపథ్యంలో.. దానికి ప్రతీకారంగా కశ్మీర్ ఉగ్రవాదులు ఈ చర్యలకు పూనుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఓ పోలీసు అధికారి కిడ్నాప్‌లతో ఉగ్రవాదులు తమపై ఒత్తిడి వ్యూహాలను అనుసరిస్తున్నారని తెలిపారు.

వివరాల ప్రకారం.. తొలుత ఉగ్రవాదులు పుల్వామా జిల్లాలో ఓ పోలీసును కిడ్నాప్ చేసి విచారించారు. ఆ తర్వాత అతన్ని చితకబాది వదిలేశారని అధికారులు తెలిపారు. పుల్వామాతో పాటు అనంతనాగ్, కుల్గామ్ జిల్లాల్లోనూ ఈ కిడ్నాప్‌లు కొనసాగాయన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో పనిచేస్తున్న మరో ఇద్దర్ని కూడా ఉగ్రవాదులు అపహరించినట్లు సమాచారం. అంతేకాక త్రాల్ సెక్టర్‌లో ఓ పోలీసు ఆఫీసర్ కుమారున్ని ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. దాంతో ఆ కుటుంబసభ్యలు తమ కొడుకును వదిలేయాలని ఉగ్రవాదులను వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయన్నారు. పోలీసు కుటుంబాలకు చెందన వారిని సురక్షితంగా ఉగ్రవాదుల చెర నుంచి విడిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీనియర్ అధికారులు చెబుతున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు కశ్మీర్‌లో ఉగ్రవాదులు.. పోలీసుల కుటుంబీకులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement