ముగిసిన రాజ్యసభ నామినేషన్ల ఘట్టం | Sakshi
Sakshi News home page

ముగిసిన రాజ్యసభ నామినేషన్ల ఘట్టం

Published Wed, Jun 1 2016 1:58 AM

ముగిసిన రాజ్యసభ నామినేషన్ల ఘట్టం - Sakshi

- మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 స్థానాలు
- నేడు పరిశీలన... 3న ఉపసంహరణ  
- యూపీ, హరియాణాలో ఎన్నిక అనివార్యం?
 
 న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం మంగళవారంతో ముగిసింది. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు, మాజీ మంత్రి చిదంబరంతో సహా పలువురు ప్రముఖులు వివిధ పార్టీల తరఫున చివరి రోజు నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలు తమ బలాబలాలకు మేరకు అభ్యర్థుల్ని బరిలోకి దింపాయి. జూన్ 11న జరిగే ఎన్నికల్లో మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 స్థానాలకు పోటీ జరగనుంది. నేడు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణ గడువు జూన్ 3. రాజ్యసభ సభ్యుడిగా గెలవాలంటే ఒక్కో అభ్యర్థి 37 ఓట్లు సంపాదించాలి.

యూపీ, హరియాణాల్లో స్వతంత్రులు బరిలోకి దిగడంతో పోటీ తప్పనిసరిగా కన్పిస్తోంది.  మంగళవారం హరియాణా నుంచి మీడియా దిగ్గజం సుభాష్‌చంద్ర, ప్రముఖ న్యాయవాది ఆర్కే ఆనంద్‌లు స్వతంత్రులుగా, మధ్యప్రదేశ్ నుంచి ఎంజే అక్బర్, ప్రముఖ పాత్రికేయుడు అనిల్ మాధవ్ దవేలు బీజేపీ తరుఫున నామినేషన్ వేశారు.  మహారాష్ట్ర నుంచి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం(కాంగ్రెస్), విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌లు(బీజేపీ), ప్రఫుల్ పటేల్(ఎన్‌సీపీ), వినయ్ సహస్రబుద్ధే, వికాస్ మహాత్మా (బీజేపీ), సంజయ్ రౌత్(శివసేన)లు నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. బిహార్‌లో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల నారాయణ్ సింగ్ నామినేషన్ వేశారు.  కర్ణాటక నుంచి  కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ తరఫున బెంగళూరు విధానసౌధలో నామినేషన్ దాఖలు చేశారు. ఆ రాష్ట్రం నుంచే కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రులైన ఆస్కార్ ఫెర్నాండెజ్, జైరామ్ రమేష్, జేడీఎస్ తరఫున ఎం.ఫారూక్ నామినేషన్ వేశారు.

 యూపీ, హరియాణాల్లో పోటీ: యూపీ నుంచి 11 స్థానాలు భర్తీ కావాల్సి ఉండగా... సామాజిక కార్యకర్త ప్రీతి మహాపాత్రో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. 403 మంది సభ్యులున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో అధికార ఎస్పీకి 229 ఎమ్మెల్యేల బలం ఉండగా, బీఎస్పీకి 80, బీజేపీకి 41, కాంగ్రెస్‌కు 29 మంది సభ్యులున్నారు. మహాపాత్రోకు బీజేపీతో పాటు ఇతర చిన్న పార్టీలు మద్దతిస్తున్నాయి. అధికార ఎస్పీ నుంచి ఏడుగురు, బీఎస్పీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు పోటీ పడుతున్నారు. హరియాణాలో అధికార బీజేపీ ఎమ్మెల్యేలు తనకు మద్దతునిస్తారని సుభాష్‌చంద్ర ధీమాతో ఉన్నారు. ఆనంద్‌కు ప్రధాన ప్రతిపక్షం ఐఎన్‌ఎల్డీ మద్దతునిస్తోంది.

Advertisement
Advertisement