ఇంటర్నెట్‌పై నిఘా‘నేత్రం | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌పై నిఘా‘నేత్రం

Published Mon, Jan 6 2014 3:02 AM

ఇంటర్నెట్‌పై నిఘా‘నేత్రం - Sakshi

న్యూఢిల్లీ: మీరు తరచూ ఫేస్‌బుక్, ట్విటర్ వాడుతుంటారా? ఈమెయిల్స్, చాటింగ్, ఇంటర్నెట్ కాల్స్, బ్లాగుల్లో మునిగితేలుతుంటారా? అందులో మిత్రులను సరదాగా ‘కాల్చేస్తా, పేల్చేస్తా.. చంపేస్తా’ అంటూ బెదిరిస్తుంటారా? అయితే ఇకపై ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే. ఆన్‌లైన్‌లో ప్రమాదకర, అనుమానాస్పద సందేశాలను, సంభాషణలను పసిగట్టేందుకు ప్రభుత్వం త్వరలో ‘నేత్ర’ పేరుతో ఇంటర్నెట్ గూఢచర్య వ్యవస్థను ప్రారంభించనుంది. హోం మంత్రిత్వ శాఖ ప్రస్తుతం దీనికి తుదిమెరుగులు దిద్దుతోంది. వైబ్‌సైట్లు, ఆన్‌లైన్ అప్‌డేట్లతోపాటు, స్కైప్, గూగుల్ టాక్ వంటి సాఫ్ట్‌వేర్‌ల గుండా నడిచే సంభాషణల్లో అనుమానాస్పదంగా తోచిన వాటిని జల్లెడపట్టేందుకు భద్రతా సంస్థలు ఈ వ్యవస్థను వాడుకోనున్నాయి. రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)కు చెందిన ప్రయోగశాల సెంటర్ ఫర్ ఆర్టిఫిసియల్ అండ్ రోబోటిక్స్(సీకెయిర్).. ‘నేత్ర’ను అభివృద్ధి చేసింది. ఇది అమల్లోకి వస్తే విద్రోహ కార్యకలాపాల కోసం ఇంటర్నెట్‌ను వాడే అనుమానాస్పద వ్యక్తులు, సంస్థల చర్యలపై మరింత పటిష్ట నిఘా ఉంచడానికి వీలవుతుందని అధికారులు చెప్పారు. నేత్ర అమలుపై హోం శాఖ, కేబినెట్ సెక్రటేరియట్, ఐబీ, సీ-డాట్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తదితర శాఖలు, సంస్థల అధికారులతో కూడిన అంతర్ మంత్రిత్వ బృందం ఇటీవల చర్చించింది. సైబర్ భద్రత కోసం ఓ వ్యూహాన్నీ రూపొందించింది. ఇంటర్నెట్ ట్రాఫిక్‌పై నిఘా కోసం ఐబీ, కేబినెట్ సెక్రటేరియట్ సహా మూడు భద్రతా సంస్థలకు 300 జీబీ స్టోరేజీని కేటాయించే అవకాశముంది.

Advertisement
Advertisement