చనిపోయినా సరిహద్దు భద్రత..!

2 Aug, 2016 20:24 IST|Sakshi
చనిపోయినా సరిహద్దు భద్రత..!

న్యూ ఢిల్లీః మరణించినా ఆ సిపాయి కర్తవ్యం కొనసాగుతూనే ఉంది. భారత సైనిక దళంలో చేరి, హిమాలయపర్వతాల్లోని ఎత్తైన ప్రాంతమైన.. భారత్-చైనా సరిహద్దు నాతుల్లాలో బాధ్యతలను నిర్వహిస్తూ... దురదృష్ట వశాత్తు అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితేనేం ఇప్పటికీ అతని ఆత్మ అక్కడ సరిహద్దు కాపలా బాధ్యతలను చేపడుతున్నట్లు స్థానికులే కాదు... తోటి సైనికులూ నమ్ముతారు. విచిత్రంగా ఉంది కదూ...

విదేశీ ఆక్రమణ దారులనుంచి మాతృభూమిని కాపాడటంలో భారత సైనికుల త్యాగం మరువలేనిది. అయితే 1968 లో మృతి చెందిన బాబా హర్బజన్ సింగ్.. ఇప్పటికీ సరిహద్దుల్లో తన బాధ్యతలు ఆత్మ రూపంలో నిర్వహిస్తున్నట్లుగా అంతా విశ్వసిస్తారు. సిక్కింలో భారీ వరదల కారణంగా సైనికులను ఇరత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్న హర్బజన్..వరద బీభత్సానికి దురదృష్ట వశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. మాతృభూమి రక్షణలో భాగంగా విధినిర్వహణలోనే ప్రాణాలు వదిలాడు. తీవ్రమైన ప్రవాహంతో మూడు రోజులుదాకా అతడి శరీరం దొరకలేదు. ఇంతలో క్యాంపులోని ఓ సిపాయికి కలలో కనిపించిన హర్బజన్.. తన శరీరం ఉన్న ప్రాంతాన్ని సూచించాడని, అక్కడే తనకు సమాధి కడితే సరిహద్దులో బాధ్యతలను కొనసాగిస్తానని చెప్పినట్లు కథనం. అయితే  సైనికుడి కలలో చెప్పినట్లుగానే చోక్యాచో ప్రాంతంలో హర్బజన్ శరీరం దొరకడంతో స్థానికులే కాక సైనికులూ విషయాన్ని నమ్మారు. అదే ప్రాంతంలో పూర్తి మిలటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి, సమాధిని కూడా కట్టారు. అతడు చనిపోయినా అక్కడే అతడి ఆత్మ సరిహద్దు భద్రతను కాపాడుతుందంటూ జనం నేటికీ నమ్ముతున్నారు.


పంజాబ్ రెజిమెంట్ లోని 23వ బెటాలియన్ కు చెందిన హర్బజన్.. దేశంపై సిపాయిలకుండే ప్రేమను నిరూపించాడు. భారత సరిహద్దు ప్రాంతాల భద్రతను కాపాడే నిజమైన సైనికుడుగా మిగిలిపోయాడు. హర్బజన్ విషయంలో ఆర్మీ కూడా మనోభావాలను, నమ్మకాలను గౌరవించినట్లుగా కనిపిస్తుంది. హర్బజన్ ను హానరరీ కెప్టెన్ గా గుర్తించి, నేటికీ జీతాన్ని ప్రతినెలా హర్బజన్ కుటుంబానికి అందజేస్తుంది. అంతేకాదు అమర సైనికుడి గౌరవార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 ను సెలవుదినంగా పాటిస్తుంది. కొన్నేళ్ళ క్రితం వరకూ.. (హర్బజన్ అధికారిక విరమణ తేదీ వరకూ)  ఆయన వాడిన వస్తువులను ప్యాక్ చేసి, సిపాయిలు.. హర్బజన్ స్వగ్రామానికి తీసుకెళ్ళి తిరిగి తీసుకురావడం నియమంగా పాటించారు. ఇటీవల భారత చైనా సరిహద్దు ప్రాంతమైన నాతుల్లాను సాధారణ పౌరుల సందర్శనా స్థలంగా కూడా మార్చారు.  భారత్ చైనా సరిహద్దుల్లో ఇరుదేశాలూ నిర్వహించే శాంతి సమావేశాల్లో చైనా సైనిక అధికారులు హర్బజన్ సింగ్ కోసం ఓ కుర్చీవేసి గౌరవ సూచకంగా దాన్ని ఖాళీగా ఉంచడం కూడా కనిపిస్తుంది. కొందరు స్థానికులు హర్బజన్ సమాధిని దేవాలయంగా భావిస్తారు. తమ ప్రాంతాన్ని దేశాన్ని కాపాడమంటూ ప్రార్థిస్తుంటారు.

మరిన్ని వార్తలు