రేప్ తర్వాత..? | Sakshi
Sakshi News home page

రేప్ తర్వాత..?

Published Wed, Jan 27 2016 5:37 PM

రేప్ తర్వాత..? - Sakshi

'ఆడది తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి'
ప్రతి 20నిమిషాలకో ఆడది.. ఈ మ(గ)దరాజ్యం నాశనం కావాలని కోరుకుంటూనేఉంది. మరి రాజ్యాలు కూలాయా? ఇంతింతై అన్నట్లు మరింత బలోపేతమయ్యాయా?
స్మితా అడుగుతోన్న ప్రశ్నలకు జవాబు చెప్పేముందు రేప్ తర్వాత ఏం జరిగిందో తెల్సుకుందాం

 

రితిక, 15
ఫొటోలో కనిపిస్తోన్న రితికకు ఇప్పుడు 15ఏళ్లు. నాలుగేళ్ల కిందట.. అంటే 11 ఏళ్ల చిరుప్రాయంలో ఆమె అత్యాచారానికి గురైంది. ఉత్తరప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ చిన్నారి గడిచిన నాలుగేళ్ల నుంచి నోరు తెరిచిందిలేదు. రేప్ జరిగిన రోజుకూడా తను మాట్లాడిందిలేదు.. కాళ్లవెంట ధారలా కారుతోన్న రక్తాన్ని చూసి అఘాయిత్యం జరిగినట్లు గుర్తించింది వాళ్లమ్మ. రితికా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్(పీటీఎస్ డీ)తో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించారు. చుట్టు ఉండే పరిస్థితులు ఆరోగ్యకరంగా ఉంటే రితిక ఆ రుగ్మత నుంచి కోలుకునే వీలుంది. అలాంటి పరిస్థితులున్న పల్లెగానీ, పట్టణంగానీ మీకు తెలిస్తే దయచేసి తెలపండి.

 

కరిశ్మ, 17
కోల్ కతా మురికివాడలోని ఓ హెయిర్ సెలూన్ లో పనిచేస్తోన్న కరిశ్మకు ఒక కొడుకున్నాడు. డీఎన్ఏను బట్టి చూస్తే ఆ పిల్లాడు జమీందార్ మనవడు. 'కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించైనా ఆ జమీందార్ కొడుకు పెళ్లి చేసుకో. మేం దగ్గరుండి పెళ్లి జరిపిస్తాం' అని కరిశ్మను ఒప్పించేప్రయత్నం చేశారు కొందరు రాజకీయనాయకులు. అంతకు ముందే తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు.. ఎవడితోనో తిరిగి కడుపుచేయించుకుందని!
తనపై దాడిచేసిన మృగంతో కలిసిఉండటం ఇష్టలేని కరిశ్మ.. రేప్ తర్వాత (2008లో) కోల్ కతాకు వచ్చేసింది.


విద్య,17
రాబర్ట్స్ గంజ్(యూపీ)కి చెందిన విద్యపై అదే ఊరికి చెందిన అగ్రకుల యువకుడు నాలుగేళ్ల కిందట లైంగికదాడి చేశాడు. స్కూల్ నుంచి ఇంటికొస్తుండగా బలవంతంగా ఎత్తుకెళ్లి రేప్ చేశాడు.

తల్లిదండ్రుల అండతో ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదుచేసిందామె. కానీ కేసు నమోదుకాలేదు. ఇప్పటికీ వాళ్లు పోరాడుతూనేఉన్నారు. ఆ క్రమంలో విద్య.. విద్యకు దూరమైంది. స్కూల్ మానేసి పనులకు వెళుతోంది.



ఇలా ఒకరిద్దరు కాదు నిర్భయభారతంలో అడుగడుగునా అగుపించే బాధితురాళ్ల గాథలను వెలుగులోకి తెచ్చేప్రయత్నం చేస్తున్నది స్మితా శర్మ. ఆమె కూడా అత్యాచారబాధితురాలే. స్కూల్ టీచర్ ఆమెను రేప్ చేశాడు. పరువుపోతుందనే భయంతో విషయం బయటికి చెప్పొద్దని హెచ్చరించారు ఆమె తల్లిదండ్రులు. అలా పదేళ్లపాటు మౌనాన్ని బిగపట్టిన స్మిత.. సోదరి మరణం(ఆమె కూడా రేప్ విక్టిమే)తో ఆలోచనలోపడింది.

 

దారుణమైన బాధ అనుభవించికూడా కేసుల జోలికి పోకుండా తనలా మౌనంగా ఉండిపోయిన మహిళలకోసం పోరాడాలనుకుంది. ఫ్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయిన ఆమె లైంగికదాడి బాధితులకోసం 'సేఫ్ సిటీ', 'యాక్షన్ బ్రేక్స్ సైలెన్స్' పేరుతో రెండు స్టార్టప్ లను ప్రారంభించింది. పీవీసీహెచ్ఆర్ అనే స్వచ్ఛంద సంస్థతోనూ కలిసి పనిచేస్తోంది. రేప్ తర్వాత.. అస్థిత్వం కోసం పోరాడుతోన్నవాళ్లకు అండగా నిలుస్తున్నది.

Advertisement
Advertisement