మమ్మీ శాపం నిజమా? | Sakshi
Sakshi News home page

మమ్మీ శాపం నిజమా?

Published Wed, Jul 5 2017 11:18 PM

మమ్మీ శాపం నిజమా?

బంగారు నిధిని కనిపెట్టాం దాన్ని తవ్వాలంటే నరబలి ఇవ్వాలి. లేదంటే ఆ నిధి మనల్ని శపిస్తుందన్న కారణంతో జరిగే ఆకృత్యాలను మనం అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. గుప్తనిధి, సమాధుల్లో అతీంద్రియ శక్తులు ఉంటాయని వాటిని తవ్వితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని చాలామంది విశ్వసిస్తుంటారు. ఈజిప్టులో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమాధిని తవ్విన వ్యక్తులు వివిధ కారణాలతో ఆకస్మాత్తుగా మరణించారు. మరి వారి మరణానికి కారణాలేంటి...?  నిజంగా సమాధిలోని
శక్తి వారిని చంపిందా లేక మరేదైనా కారణాలతో చనిపోయారా అన్న విషయాలను ఈ రోజు తెలుసుకుందాం...!   


ఈజిప్టువాసులకు పునర్జన్మ, మరణం అనంతరం జీవితంపై అంతులేని విశ్వాసం. అందుకే, వ్యక్తి మరణించినా.. వారు తిరిగి లేస్తారని భావించేవారు. అందుకే, వారి శరీరాలు పాడవకుండా జాగ్రత్తగా ఖననం చేసేవారు. చనిపోయిన వ్యక్తికి తిరిగి ప్రాణమొస్తే.. అతనికి ఉపయోగపడేలా.. కావాల్సిన పాత్రలు, వస్తువులను సమాధిలో ఉంచేవారు. చనిపోయింది రాజులైతే.. వారికి తోడుగా పనివాళ్లని కూడా బతికుండగానే.. మమ్మీలుగా మార్చేవారు. అలాంటిది ఏకంగా ఈజిప్టు రాజు ట్యుట్‌ అంక్‌ మూన్‌ అనే రాజు మరణించాడు.

వారి ఆచారాల ప్రకారం అతినికిష్టమైన వస్తువులు, కళాఖండాలు బంగారంతో పొదిగిన ఆభరణాలు అతనితోపాటే సమాధిలో పెట్టారు. అంతేకాదు సమాధిలో ఆయన తినడానికి వీలుగా  బంగారు, వెండితో చేసిన పాత్రలను కూడా ఉంచారు. టూట్స్‌ సమాధిలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయని అక్కడి ప్రజలందరికి తెలిసినప్పటికీ దాన్ని ఎవరూ తెరిచేందుకు సాహసించేవారు కాదు. ఎందుకంటే ఆ సమాధిని తెరిస్తే తాము శాపానికి గురై అకాలమరణం చెందుతామని వారి విశ్వాసం.  

స్థానికులు వారించినా
1923లో బ్రిటిష్‌ ఆర్కియాలజికల్‌ సంస్థకు చెందిన లార్డ్‌ కార్నర్‌వాన్, హవర్డ్‌కార్టర్‌లు టూట్స్‌ సమాధి తెరిచేందుకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను జార్జ్‌ హెబర్ట్‌ నిధులు సమకూర్చారు. సమాధి తెరిస్తే శాపానికి గురౌతారని స్థానికులు ఎంత వారించినప్పటికీ వారి ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోలేదు. ఇలాంటి మూఢవిశ్వాసాలను తామేమాత్రం లెక్కచేయమన్నారు. కార్నర్‌వాన్‌ ఆధ్వర్యంలో సమాధిని తెరిచారు. అయితే సమాధిని తెరిచిన నెలరోజులకు ఒకరోజు ఉదయం కార్నర్‌వాన్‌ గడ్డం గీసుకుంటుండగా అతని చెంపపై దోమ కుట్టింది. అది ఇన్‌ఫెక్షన్‌గా మారడంతో ఆసుపత్రికి వెళ్లాడు.

ఆయన ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని మందులు వాడినప్పటికీ ఇన్‌ఫెక్షన్‌ తగ్గలేదు. చివరికి ఆయన శరీరంలోని రక్తం కుళ్లిపోయి కార్నర్‌వాన్‌ మరణించాడు. ఇలా ఆ సమాధి తెరిచినప్పుడు ఉన్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు మరణించడం మొదలైంది. ఒకరు ఆత్మహత్య చేసుకుంటే మరొకరు అనారోగ్య కారణాలతోగానీ మరేదైనా కారణాలతోగానీ మరణించారు.  ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుంటే ఆ సమాధిని తెరవడం వల్లనే శాపానికి గురై మరణించారని ప్రచారం మొదలైంది. స్థానికంగా ఉన్న మీడియా కూడా సమాధిలో ఉన్న శక్తే వీరిని శపించిందని కథనాలు రాసింది. కార్నర్‌ మరణం ఒక్కటే కాదు ఆ సమాధిలో ఉన్న ప్రతిఒక్కరూ మరణిస్తారనుకున్నారు స్థానికులు. సమాధి తెరిచేందుకు సహకరించిన వ్యక్తులు ఆకస్మాత్తుగా మరణిస్తుండటంతో ఈ పుకార్లు మరింత షికారు చేసాయి.

ఏది నిజం?
ఇలా ఒకరితర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాలకు కారణాలేంటని శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. నిజంగా సమాధిలో ఉన్న శక్తి శపించడం మూలాన వారు మరణించారా? లేదా మరేదైనా కారణాలతో మరణించారా అని అధ్యయనం సాగించారు. దానికి వారు కొన్ని కారణాలను ఉదహరించారు.  సమాధిని ఇతరులెవరూ తెరవకుండా ఉండేందుకు ఆ శవపేటికల గోడలకు గుర్తు తెలియని విషాన్ని పూసి ఉంటారన్నది కొందరు విశ్లేషించారు. లేదా వేల ఏళ్లుగా సమాధి గోడలపై ఉన్న ప్రమాదకర బ్యాక్టీరియా వారి చేతుల ద్వారా శరీరంలోకి వెళ్లి అనారోగ్యం బారిన పడిఉంటారని మరికొందరు వివరించారు. అంతేకాదు.. అక్కడున్న వ్యక్తులకు ఇదివరకు వివిధ అనారోగ్య సమస్యలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ, పుకారుకు వేగమెక్కువ కాబట్టి.. జనాలు శాపాన్నే ఎక్కువగా నమ్మారు. అయితే, సమాధిని తెరిచిన తర్వాత తొలిసారి అందులోకి దిగిన హవార్డ్‌ కార్టర్‌ మాత్రం పది సంవత్సరాలకు పైగా జీవించడం విశేషం.– సాక్షి స్కూల్‌ ఎడిషన్‌

Advertisement
Advertisement