4 తరాల బూటకపు హామీలు | Sakshi
Sakshi News home page

4 తరాల బూటకపు హామీలు

Published Mon, Apr 1 2019 2:13 AM

There Was No Change in The Congress Party Promises Says Modi - Sakshi

న్యూఢిల్లీ: పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాలుగు తరాలు వాగ్దానాలు చేసినా ఎలాంటి మార్పు రాలేదని ప్రధాని మోదీ అన్నారు. పేదరికంపై మాటలు వల్లిస్తున్న వారి ట్రాక్‌ రికార్డును యువజనులు గమనించాలని సూచించారు. దేశానికి రాజులు, మహారాజులు అక్కర్లేదని, చౌకీదార్‌ స్ఫూర్తి విస్తరించడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. ఆదివారం ‘మై భీ చౌకీదార్‌’ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇటీవల ప్రతిపాదించిన కనీస ఆదాయ హామీ పథకాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేసిన ఏశాట్‌ ప్రయోగాన్ని ఎన్నికలతో ముడిపెట్టొద్దని, ఈ విజయంపై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం పట్ల తనను విమర్శించిన వారిపై మండిపడ్డారు. అమెరికా, రష్యా, చైనాలు ఇలాంటి ప్రయోగాల్ని బహిరంగంగానే చేశాయని, మనమెందుకు గోప్యంగా ఉంచాలని నిలదీశారు. సుమారు 500 ప్రాంతాల్లో ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, వ్యాపారులు, రైతులు, వాచ్‌మెన్‌లు వీక్షించారు. అనేక ప్రశ్నలకు మోదీ సమాధానాలిచ్చారు.  

ట్రాక్‌ రికార్డును గమనించండి
రాహుల్‌ ప్రతిపాదించిన న్యాయ్‌ పథకాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ ‘ దేశ తొలి ప్రధాని పేదరికంపై ఆందోళన వ్యక్తం చేసి దాన్ని నిర్మూలిస్తానని చెప్పారు. తరువాత ఆయన కూతురూ అదే నినాదాన్ని ఎత్తుకున్నారు.  ఆమె కొడుకు కూడా  అదే నినాదాన్ని విస్తరించారు. ఆయన భార్య రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వాన్ని నడిపి పేదరికాన్ని మరింత పెంచారు. ఇక ఇప్పుడు ఆమె తనయుడి వంతు వచ్చింది. కొత్తగా ఓటేసే వారు ఈ నాలుగు తరాల ట్రాక్‌ రికార్డును గమనించాలి’ అని అన్నారు. ఉగ్రవాదుల్ని నియంత్రిస్తున్న చోటు నుంచే ఆట ప్రారంభించాలి కాబట్టే బాలాకోట్‌లో వైమానిక దాడులు చేశామని ప్రధాని తెలిపారు. వైమానిక దాడుల తరువాత తనపై చేసిన విమర్శలు పాకిస్తాన్‌కే మేలు చేస్తాయని హెచ్చరించారు. 

దేశం కంటే వ్యక్తిగత ప్రయోజనాల పైనే ఆసక్తి: మోదీ
గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశ భద్రత కంటే వ్యక్తిగత ప్రయోజనాల పైనే ఆసక్తి చూపేదని.. ఫలితంగా దేశంలో అవినీతి ఎక్కువైందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆదివారం ఓ న్యూస్‌ చానల్‌ను ప్రారంభిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. దేశానికి యాంటీ శాంటిలైట్‌ మిస్సైల్‌ను ప్రయోగించే సామర్థ్యం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం వెనకడుగు వేసిందని అన్నారు. నల్లధనం కట్టడికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 

Advertisement
Advertisement