పోస్ట్మాస్టర్ అమర ప్రేమ | Sakshi
Sakshi News home page

పోస్ట్మాస్టర్ అమర ప్రేమ

Published Fri, Aug 21 2015 1:03 PM

పోస్ట్మాస్టర్ అమర ప్రేమ

లక్నో: భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆగ్రాలో  చారిత్రాత్మక  తాజ్ మహల్ను నిర్మిస్తే  యూపీలో  ఓ ప్రేమ చక్రవర్తి తన హృదయరాణి కోసం మరో తాజ్మహల్ నిర్మాణానికి పూనుకున్నాడు.   తల తాకట్టు పెట్టయినా సరే తన ప్రేమమందిరాన్ని పూర్తి చేస్తానంటున్నాడు. నిర్మాణ దశలో ఉన్న ఈ కట్టడం  చుట్టుపక్కల గ్రామస్తులనే కాదు, సాక్షాత్తూ యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్  యాదవ్ను  కూడా ఆకర్షించింది.

వివరాల్లోకి వెళితే యూపీలో బులంద్శహర్లో నివసించే ఫైజల్  హసన్  ఖ్రాది (80) పోస్ట్ మాస్టర్ గా పనిచేసి రిటైరయ్యాడు.  58 ఏళ్ల వైవాహిక  జీవితం తర్వాత అతని భార్య తాజాముల్లి బేగం క్యాన్సర్తో  2011లో కన్నుమూసింది.  దీంతో  పవిత్రమైన తమ ప్రేమకు గుర్తుగా ఓ మినీ తాజ్మహల్  రూపొందించాలని హసన్  ఖ్రాది నిర్ణయించాడు. అలాగే తన భార్య సమాధి పక్కనే తన శాశ్వత నిద్రకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు.


అయితే వృద్ధాప్యంలో అతని అంతులేని ప్రేమను,  పడుతున్న కష్టాన్ని  చూసిన  కొంతమంది సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కానీ హసన్  ఖ్రాది దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అంతేకాదు  ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, స్థానిక అధికారులు ఆర్థిక సహకారం అందిస్తామన్నా అంగీకరించలేదు. తన సొంత డబ్బుతోనే  ఆ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు. దీనికోసం తన వ్యవసాయ భూమిని, భార్య నగల్ని అమ్మేశాడు. ఇప్పటివరకు మొత్తం పదకొండు లక్షలు వెచ్చించాడు. మార్బుల్స్ తదితర  పనుల కోసం మరో ఆరేడు లక్షలకు పైగా ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.

'గొంతు క్యాన్సర్తో  నా భార్య చనిపోయిన తరువాత నాకంతా శూన్యంలా అనిపించింది. నేనూ పోతాను..ఈ భవనం కూడా కూలి పోతుంది. కానీ నేను  చనిపోయే ముందు ఈ ప్రేమమందిరాన్ని పూర్తిచేయాలి, దాన్ని కళ్లారా చూడాలనేదే  నా కోరిక. అలాగే నేను పోయిన తరువాత నా అంత్యక్రియలు కూడా ఇక్కడే జరగాలి. ఈ విషయాన్ని తమ్ముడికి చెప్పాను. ఇందుకు అవసరమైన డబ్బులు కూడా డిపాజిట్ చేశా'నంటూ  తన మనసులోని మాటను వెల్లడించాడు. మరోవైపు తనకు చేస్తానన్న ధన సహాయంతో  గ్రామంలో పాఠశాల భవనాన్ని నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరనున్నానని  ఖాద్రి  తెలిపాడు.




 

Advertisement
Advertisement