నేడు పీఎస్‌ఎల్‌వీ సీ26 కౌంట్‌డౌన్ | Sakshi
Sakshi News home page

నేడు పీఎస్‌ఎల్‌వీ సీ26 కౌంట్‌డౌన్

Published Mon, Oct 13 2014 1:36 AM

నేడు పీఎస్‌ఎల్‌వీ సీ26 కౌంట్‌డౌన్

ఉదయం 6.32 గంటలకు ప్రారంభం
గురువారం తెల్లవారుజామున 1.32 గంటలకు ప్రయోగం

 
సూళ్లూరుపేట: భారత ప్రాంతీయ ఉపగ్రహ దిక్సూచీ వ్యవస్థ(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) ఏర్పాటు కోసం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీ ఉపగ్ర హాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ-26 రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు సర్వం సిద్ధం అయింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీశ్‌ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ26 రాకెట్ ప్రయోగానికి సోమవారం ఉదయం 6.32 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించిది. సుమారు 67 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం తెల్లవారుజామున 1:32 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ26ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపింది. ఈ రాకెట్ ద్వారా 1,425 కిలోల బరువైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీ ఉపగ్రహాన్ని నింగికి పంపనున్నారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఏర్పాటు కోసం కనీసం నాలుగు, గరిష్టంగా ఏడు ఉపగ్రహాలను నింగికి పంపాల్సి ఉండగా.. ఇప్పటిదాకా రెండు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.

ఈ ప్రయోగాన్ని ఈ నెల 10వ తేదీనే చేపట్టాలని నిర్ణయించినా.. టెలీకమాండ్ ప్యాకేజీలో సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది. కౌంట్‌డౌన్ వ్యవధిలో రాకెట్‌లోని రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనం, కొన్ని వ్యవస్థలకు హీలియం, నైట్రోజన్ తదితర వాయువులను నింపే ప్రక్రియను చేపడతారు. ప్రయోగానికి 10 గంటల ముందు రాకెట్‌లోని ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. చివరి 20 నిమిషాల్లో కంప్యూటర్ వ్యవస్థలన్నింటిని అప్రమత్తం చేస్తారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో ఇది 28వ ప్రయోగం కాగా.. ఇప్పటిదాకా మొదటి ప్రయోగం తప్ప అన్నీ విజయవంతం అయ్యాయి.
 
 

Advertisement
Advertisement