రెండు రాష్ట్రాల్లో రేపే ‘తొలి దశ’ | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల్లో రేపే ‘తొలి దశ’

Published Mon, Nov 24 2014 1:59 AM

రెండు రాష్ట్రాల్లో రేపే ‘తొలి దశ’ - Sakshi

  • జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లలో ముగిసిన ఎన్నికల ప్రచారం    
  •  కశ్మీర్‌లో 15 సీట్లు, జార్ఖండ్‌లో 13 స్థానాల్లో పోలింగ్
  • రాంచీ/జమ్మూ: జార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. జార్ఖండ్‌లోని 13 మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు, జమ్మూకశ్మీర్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తొలి దశ ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో గడువు ముగిసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సహా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. కశ్మీర్ తొలి విడత పోలింగ్ బరిలో 123 మంది, జార్ఖండ్ తొలి దశ బరిలో 199 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
     
    ‘బీజేపీ పాలనలో జార్ఖండ్ భ్రష్టుపట్టింది’

    దల్తోంగంజ్/గుమ్లా: ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడి 14 ఏళ్లు అయిందని, దీనిలో 11 ఏళ్లపాటు ఈ రాష్ట్రాన్ని బీజేపీయే పాలించిందని, ఈ కాలంలో జార్ఖండ్ అభివృద్ధి సాధించింది లేకపోగా మరింత దిగజారి పోయిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కే వలం మూడు జిల్లాలకే పరిమితమైన మావోయిస్టు సమస్య ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికి పాకిందని ఆందోళన వ్యక్తం చేశారు.

    అభివృద్ధితోనే మావోయిస్టు సమస్యను తరిమి కొట్టొచ్చన్నారు. అదేవిధంగా దేశంలోని సహజ సంపదను ప్రజల చేతికే అప్పగించడం వల్ల అభివృద్ధి త్వరితగతిన సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆమె జార్ఖండ్‌లోని మావోయిస్టు ప్రభావిత దల్తోంగంజ్, గుమ్లా ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నక్సలిజం బాటపట్టిన యువతను జనజీవన స్రవంతిలోకి మళ్లించాల్సిన అవసరముందన్నారు.

    గిరిజనులు, దళితులు, పేదలు, బీసీలకు హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో తాము తీసుకొచ్చిన భూ సేకరణ చట్టానికి కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సవరణలు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అదేవిధంగా జార్ఖండ్‌లోని గిరిజనుల భూములకు రక్షణ కల్పించే ఉద్దేశంతో తెచ్చిన కౌలు హక్కు దారుల చట్టాన్ని కూడా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని సోనియా విమర్శించారు.

    రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోవడానికి 11 ఏళ్లు పాలించిన బీజేపీయే కారణమన్న విషయాన్ని ప్రధాని మోదీకి తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు యూపీయే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇచ్చిందని, అయితే, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయా నిధులను ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు.
     
    ‘బీజేపీ మునుగుతుంది’

    శ్రీనగర్: వివాదాస్పద ఆర్టికల్ 370 విషయంలో రెండు పడవల ప్రయాణం చేస్తే బీజేపీ మునిగిపోవడం ఖాయమని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. బీజేపీ ఒక అవకాశవాద పార్టీ అని ఆదివారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్టికల్ 370పై బీజేపీ పలువిధాలుగా మాట్లాడుతుండటంపై ప్రశ్నించగా.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జమ్మూలో ఆ ఆర్టికల్‌పై మాట్లాడితే జాతీయ అంశం అవుతుంది కాబట్టి అక్కడ మౌనంగా ఉంటున్నారని, కశ్మీర్ లోయలో మరోలా వ్యవహరిస్తూ ప్రాంతాన్ని బట్టి మాటలు మారుస్తున్నారని విమర్శించారు. శనివారం కిస్టవార్‌లోని ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని మోదీ 370 అధికరణపై ఏమీ మాట్లాడని విషయం తెలిసిందే.
     
    మోదీ వ్యాఖ్యలు ఎన్నికల స్టంట్: ముఫ్తీ

    కశ్మీర్‌లో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలన్నీ ఎన్నికల స్టంట్ అని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి విమర్శించారు. ఆదివారం దక్షిణ కశ్మీర్‌లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీకి రాష్ట్ర విషయాలేమీ సరిగా తెలియవని మోదీ వ్యాఖ్యలతో అర్థమవుతోందని విమర్శించారు.
     

Advertisement
Advertisement