కేజ్రీవాల్ కు మమత మద్దతు? | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ కు మమత మద్దతు?

Published Mon, May 25 2015 7:16 PM

కేజ్రీవాల్ కు మమత మద్దతు?

కోల్ కతా: ఢిల్లీ ఏసీబీ విభాగం అంశానికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి పరోక్ష మద్దతు లభిస్తుందా? అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమాఖ్య వ్యవస్థలో  కేంద్రం పదేపదే జోక్యం చేసుకోవడం తగదన్న మమత వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఎలాగైతే కేబినెట్ ఉంటుందో.. అలానే ప్రతీ రాష్ట్రానికి కూడా కొంతమంది సభ్యులతో కూడిన కేబినెట్ ఉంటుందని కేంద్రాన్ని విమర్శించారు.  రాష్ట్ర కేబినెట్ కు కూడా అధికారాలు ఉంటాయన్న విషయాన్ని కేంద్రం గ్రహించాలని మమత ట్వీట్టర్లో హితబోధ చేశారు.

కేంద్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏసీబీ అధికారులు విచారించడానికి వీల్లేదని, భూమికి సంబంధించిన అంశాలు, ఢిల్లీ పోలీసులు, కీలక అధికారుల నియామకం లాంటి అంశాల్లో వేలుపెట్టే అధికారం ఢిల్లీ సర్కారుకు లేదని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ ఏసీబీ విభాగం తప్పనిసరిగా కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచే ఆదేశాలు తీసుకుని, వాటిని పాటించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వం నుంచి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఢిల్లీ మంత్రివర్గం సలహా, సహాయాలతోనే పనిచేయాలని జడ్జి స్సష్టం చేశారు. ఈ నేపథ్యంలో మమత చేసిన ట్వీట్స్ ఆసక్తికరంగా మారాయి. కాగా, ఆమె చేసిన ట్వీట్స్ ఢిల్లీ హైకోర్టు తీర్పుకు ముందు చేశారా? లేక తరువాత చేశారా?అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement
Advertisement