పార్లమెంటులో ట్రాఫిక్ జామ్ | Sakshi
Sakshi News home page

పార్లమెంటులో ట్రాఫిక్ జామ్

Published Fri, Dec 11 2015 2:08 AM

పార్లమెంటులో ట్రాఫిక్ జామ్ - Sakshi

సభా కార్యక్రమాలకు కాంగ్రెస్ ఆటంకం
♦ వరుసగా మూడోరోజూ ఉభయ సభల్లో ‘హెరాల్డ్’ దెబ్బ
 
 న్యూఢిల్లీ: పార్లమెంటు కార్యక్రమాలకు కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుపడుతోంది. ఉభ య సభల్లోనూ.. ఇదేస్థితి. రాజ్యసభలో జీఎస్ టీ వంటి బిల్లులు సభ ముందుకు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ సభను అడ్డుకుంటోంది. గురువారం రాజ్యసభ మొదలైనప్పటి నుంచీ.. కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోనే నిలబడి నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ అదే పరిస్థితి. అన్ని అంశాలనూ చర్చిద్దామని కేంద్ర మంత్రులు నడ్డా, రవిశంకర్ ప్రసాద్, నఖ్వీ విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు. మధ్యాహ్నం ‘విజిల్‌బ్లోయర్స్ ప్రొటెక్షన్ (సవరణ)బిల్లు’పైనా చర్చ మొదలు కాలేదు. అటు పోలవరం నిర్మాణం ఆపాలంటూ బీజేడీ, చెన్నై వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలంటూ అన్నాడీఎంకే నిరసన తెలిపాయి.

సభ వాయిదా పడి తిరిగి సమావేశమైనా అదే పరిస్థితి కొనసాగటంతో..డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అటు లోక్‌సభలోనూ నిరసనల పర్వం కొనసాగింది. కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్‌ను సస్పెండ్ చేయాలని లేదా ఎంపీ క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించింది. అయితే దీనిపై జోక్యం చేసుకున్న స్పీకర్.. ‘ఎంపీని మందలించాను. ఆయన విచారం వ్యక్తం చేశారు’ అనిచెప్పినా కాంగ్రెస్ వెనక్కు తగ్గకపోవటంతో.. మంత్రి వెంకయ్య ‘బుధవారం ఉపసభాపతి తంబిదురైపై పేపర్లు విసిరిన, మోదీని హిట్లర్ అన్న కాంగ్రెస్ ఎంపీలపైనా చర్యకు సిద్ధమేనా?’ అని వెంకయ్య ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఖర్గే, వెంకయ్య మధ్య వాగ్వాదం జరగటంతో కాంగ్రెస్, టీఎంసీ లు వాకౌట్ చేశాయి.
 
 చట్టానికి ‘రాణి’ జవాబుదారి కాదంటే కుదరదు: జైట్లీ
 న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పదునైన విమర్శలు చేశారు. చట్టానికి ‘రాణి’ జవాబుదారీ కాదనే వైఖరిని దేశం ఎప్పుడూ ఆమోదించలేదని దుయ్యబట్టారు. చట్టం ముందు అందరూ సమానులేనని...చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. ఈ వ్యవహారంపై పార్లమెంటును స్తంభింపజేసే బదులు కోర్టులో తేల్చుకోవాలని సోనియా, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు సూచించారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను జైట్లీ తోసిపుచ్చారు.

Advertisement
Advertisement