దారుణ ఘటనపై ఏడు గంటల బంద్‌ | Sakshi
Sakshi News home page

దారుణ ఘటనపై ఏడు గంటల బంద్‌

Published Mon, Oct 16 2017 5:42 PM

odisha_protest

భువనేశ్వర్‌(ఒడిశా): గిరిజన బాలికపై గ్యాంగ్‌రేప్‌ ఘటనపై విచారణ చేపట్టి, కారకులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిర్వహించిన బంద్‌ విజయవంతమయింది. ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లాకు చెందిన 9వ తరగతి చదివే గిరిజన బాలిక ఈనెల 10వ తేదీన గ్యాంగ్‌రేప్‌నకు గురయింది. ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న జవానులు, మావోయిస్టులు తాము ఈ కారణం కాదంటూ ఇప్పటికే ప్రకటించారు.

ఈ నేపథ్యంలో గ్యాంగ్‌రేప్‌నకు పాల‍్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ ఏడుగంటల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో కొరాపుట్‌ జిల్లాలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు దుకాణాలు, బ్యాంకులు, వివిధ వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోలను విడిచి బయటకు రాలేదు. బంద్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించిందని కాంగ్రెస్‌ నాయకత్వం తెలిపింది.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిందితులను శిక్షించి బాధితురాలికి రూ.50లక్షల పరిహారం సాయంగా అందించాలని అసెంబ్లీలో కాంగ్రెస్‌ విప్‌, స్థానిక ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినిపతి డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దారుణ ఘటన జరిగి ఏడురోజులైనా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేకపోయారని విమర్శించారు. కాగా, ఈ కేసులో ఎటువంటి ఆధారం లభ్యం కాకపోవడంతో పోలీసులు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు.

Advertisement
Advertisement