Sakshi News home page

పుతిన్‌ జోక్యం చేసుకోలేదట!

Published Sun, Nov 12 2017 2:02 AM

Trump believes Putin on Russia meddling, says Mueller may cost lives - Sakshi

హనోయ్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోలేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ చెప్పారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. వియత్నాంలో ఆసియా–పసిఫిక్‌ ఎకనామిక్‌ సదస్సు వేదికగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. వియత్నాం రాజధాని హనోయ్‌కు వెళ్తూ మార్గమధ్యంలో ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ట్రంప్‌ మాట్లాడుతూ ‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను జోక్యం చేసుకోలేదని పుతిన్‌ చెప్పారు. నేను మరోసారి అడిగా.. అప్పుడు కూడా తాను జోక్యం చేసుకోలేదని చెప్పారు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

మేం కలిసిన ప్రతిసారి అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని పుతిన్‌ నిరాకరించారని, పదే పదే ఆరోపణలు చేయడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నారని ట్రంప్‌ చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై వస్తున్న వార్తలన్నీ ఊహాజనితమేనని, ఇవన్నీ అమెరికా అధ్యక్ష పదవిని బలహీనపరిచే ప్రయత్నాలని పుతిన్‌ అన్నారు. రాజకీయ మనుగడ కోసం అమెరికాకు చెందిన కొందరు చేస్తున్న ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌కు రష్యాతో సంబంధాలపై పుతిన్‌ స్పందిస్తూ.. ‘రాస్‌ గతంలో వ్యాపారాలు చేశారు. అప్పుడు రష్యన్‌ కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకుని ఉండవచ్చు. దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పారు.  

సిరియాకు సైనిక చర్య పరిష్కారం కాదు
సిరియా సంక్షోభం ముగింపునకు సైనిక చర్య పరిష్కారం కాదని అమెరికా, రష్యాలు అవగాహనకు వచ్చాయి. ఆసియా– పసిఫిక్‌ వాణిజ్య సదస్సులో ట్రంప్, పుతిన్‌ల మధ్య ఆ మేరకు అంగీకారం కుదిరిందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ వెల్లడించింది. ఐసిస్‌ను మట్టుబెట్టే విషయంలో దృఢసంకల్పంతో ముందుకు సాగాలని వారిద్దరు నిర్ణయించారని పేర్కొంది. సిరియా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు ఇద్దరు అధ్యక్షులు కట్టుబడి ఉన్నారని, జెనీవాలో ఐరాస నేతృత్వంలో సాగుతున్న శాంతిచర్చల్లో సిరియా వైరి వర్గాలు భాగస్వాములు కావాలని పుతిన్, ట్రంప్‌లు పిలుపునిచ్చారని తెలిపింది. 

Advertisement

What’s your opinion

Advertisement