పీతకు ఠాక్రే ఇంటి పేరు! | Sakshi
Sakshi News home page

పీతకు ఠాక్రే ఇంటి పేరు!

Published Sat, Feb 27 2016 12:43 PM

పీతకు ఠాక్రే ఇంటి పేరు!

వాళ్లది మహారాష్ట్రలోనే అత్యంత శక్తిమంతమైన రాజకీయ కుటుంబం. తాతగారి దగ్గర్నుంచి తండ్రి వరకు అంతా రాజకీయాల్లో ఆరితేరినవాళ్లే. రాష్ట్రాన్ని శాసిస్తున్నవాళ్లే. కానీ.. ఆ ఇంట్లో పుట్టిన పిల్లాడు మాత్రం తాను కొత్తగా కనుగొన్న ఓ జాతి పీతకు తమ ఇంటిపేరు పెట్టాడు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చిన్న కుమారుడు తేజస్ ఠాక్రే (19)కి జంతువులంటే బాగా ఇష్టం. సింధుదుర్గ్ జిల్లాలోని సావంత్‌వాడి పట్టణంలో కనిపించే బుల్లి పీతలకు అతడు 'ఠాక్రే' అనేపేరు పెట్టాడు. పూర్తిపేరు 'గుబెర్‌నాటోరియానా ఠాకరాయి'. ఇంతకుముందు శివసేనకు సంబంధించిన మరాఠీ పేర్ల విషయాల్లో కొన్ని వివాదాలు వచ్చినా.. ఇందులో మాత్రం అలాంటిదేమీ లేదు.

అడవులన్నా, వాటిలోని జీవజాలాలన్నా తేజస్‌కు బాగా ఇష్టం. గత సంవత్సరం కొంతమంది స్నేహితుల బృందంతో కలిసి కొంకణ్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అరుదైన పాము జాతిని కనుక్కోవాలన్నది వాళ్ల ప్రయత్నం. కానీ, అతడికి రఘువీర్ ఘాట్స్ సమీపంలో ఐదు కొత్త జాతులకు చెందిన మంచినీటి పీతలు కనిపించాయి. దాంతో వాటన్నింటికీ పేర్లు పెట్టి, వాటి జాతి వివరాలను కూడా అంతర్జాతీయ సైన్స్ పత్రికలకు పంపగా.. వాటికి సంబంధించిన పరిశోధన పత్రం కూడా జూటాక్సా అనే పత్రికలో ప్రచురితమైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement