అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉద్ధవ్ ఠాక్రే

16 Jun, 2019 14:46 IST|Sakshi

న్యూఢిల్లీ: శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం తన కుటుంబ సభ్యులు, పార్టీ ఎంపీలతో కలసి అయోధ్యను సందర్శించారు. ఇక్కడి తాత్కాలిక రామాలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీరాముడి ఆశీస్సులు కోసం వచ్చినట్లు ఆయన తెలిపారు. రామ మందిర నిర్మాణం త్వరగా జరుగుతుందని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అయోధ్యకు పదే పదే రావాలని భావిస్తున్నట్లు ఉద్ధవ్‌ చెప్పారు. "మొదట ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి.. తరువాత రామాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని ఆయన అన్నారు. ప్రధాని మోదీకి ధైర్యం ఉందని, రామాలయం కోసం ఆర్డినెన్స్‌ తెచ్చే విషయాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.

గత నవంబర్‌లో ఠాక్రే అయోధ్యను సందర్శించి 2018లోనే రామమందిర నిర్మాణ తేదీని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రామమందిర నిర్మాణానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రావత్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ, “మాకు అయోధ్య, రామాలయం రాజకీయాలకు సంబంధించినవి కావు. మేము ఎప్పుడూ ఆలయ పేరిట ఓట్లు కోరలేదు’ అని అన్నారు.


 

>
మరిన్ని వార్తలు