Sakshi News home page

పది కోట్ల ఉద్యోగాలెక్కడ!?

Published Mon, Mar 26 2018 5:33 PM

Unemployment In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతోంది. బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్న యువతకు ముందంతా అంధకార బంధురమే కనిపిస్తోంది. మొన్నటి మొన్న మహారాష్ట్రలో మూడున్నర వేల మంది రైల్వేలో అప్రెంటీస్‌లుగా శిక్షణ పొందిన నిరుద్యోగ యువకులు మెట్రో రైళ్ల రాకపోకలను స్తంభింపచేయడం ఈ విషయాన్ని సూచిస్తోంది. రాజస్థాన్‌ సచివాలయంలో 18 ప్యూన్‌ ఉద్యోగాల నియామకాలకు పిలుపునిస్తే 129 మంది ఇంజనీర్లు, 23 మంది లాయర్లు, ఓ చార్టెట్‌ అకౌంటెంట్, 393 మంది పోస్ట్‌ గ్రాడ్యువేట్లు సహా మొత్తం 12, 453 మంది దరఖాస్తు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఈ జనవరి నెల అంచనాల ప్రకారం దేశంలో నిరుద్యోగ సమస్య 6.1 శాతానికి చేరుకుంది. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య 2017, మార్చి నెలలో 4.11 ఉండగా ఇప్పుడది 5.65 శాతానికి చేరుకుంది. వ్యవసాయంపై ఎక్కువ అధారపడిన మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో కూడా 3.7 శాతానికి చేరుకుంది. వ్యవసాయం పరిస్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో ఇటీవలనే 35 వేల మంది నాసిక్‌ నుంచి ముంబైకి భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా యువతకు ఉద్యోగాలు కల్పించడం తన ప్రాథామ్యాల్లో ఒక్కటని చెప్పుకుంది.

ఏడాదికి రెండున్నర కోట్ల ఉద్యోగాల చొప్పున పదేళ్లలో 25 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో అంటే, 2015లో 1.55 లక్షలు, 2016లో 2.31 లక్షలు, 2017లో 4.16 లక్షల ఉద్యోగాల నియామకాలు జరిగాయి. పదేళ్లలో 25 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట ఇచ్చిన నరేంద్ర మోదీ నాలుగేళ్ల కాలంలో పది కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది, అందులో పది లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేక పోయారు. 2018లో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని ఆయన ప్రభుత్వమే ఇటీవల అంచనాలు వేసి చెప్పింది. ఏటా పుట్టుకొచ్చే  నిరుద్యోగుల్లో ఈ ఉద్యోగాల సంఖ్య ఎంత?

Advertisement

తప్పక చదవండి

Advertisement