Sakshi News home page

17 మంది జవాన్ల వీరమరణం

Published Sun, Sep 18 2016 11:50 AM

17 మంది జవాన్ల వీరమరణం - Sakshi

బరాముల్లా(జమ్మూ కశ్మీర్‌): జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత్‌కు చెందిన అత్యంత కీలక బేస్‌ క్యాంపుపై ఉగ్రవాదులు ఆదివారం తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు. యురి సెక్టార్‌లో ఆర్మీ బెటాలియన్‌  ప్రధాన కార్యాలయంపై జవానులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో 17 మంది జవాన్లు వీర మరణం పొందగా, 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్‌ ఆసుత్రికి తరలించి చికిత్స​ అందిస్తున్నారు.

 
బారాముల్లాలోని యురిసెక్టార్‌లోని ఆర్మీ బెటాలియన్‌ 12వ బ్రిగేడ్‌ ప్రధాన కార్యాలయం లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌(ఎల్‌ఓసీ)కి అతి సమీపంలో ఉంది. తెల్లవారుజామున చీకటిగా ఉ‍న్న సమయంలో ఫెన్సింగ్‌ తొలగించి ముష్కరులు లోపలికి ప్రవేశించినట్టు తెలుస్తోంది. పటాన్‌ కోట్‌లో జరిగిన ఉగ్రదాడి కన్నా ఈ దాడిలో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉ‍గ్రవాదులను హతమయ్యారు.

ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యా, అమెరికాపర్యటనలను వాయిదా వేసుకొని సంబంధిత ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌, సీఎంతో రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడారు. ఉగ్రవాదుల దాడితో సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు. రక్షణ మంత్రి మనోహర్‌ పారీకర్‌ కశ్మీర్‌ బయలుదేరారు. గాయపడిన సైనికులను ఆసుపత్రిలో పరామర్శించనున్నారు.

Advertisement
Advertisement