ముంచుకొస్తున్న కార్చిచ్చు.. 1500 గ్రామాలు బిక్కుబిక్కు | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న కార్చిచ్చు.. 1500 గ్రామాలు బిక్కుబిక్కు

Published Sat, Apr 30 2016 6:58 PM

ముంచుకొస్తున్న కార్చిచ్చు.. 1500 గ్రామాలు బిక్కుబిక్కు - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ అడవిలో పుట్టిన కార్చిచ్చు .. అంతకంతకూ విస్తరిస్తూ.. చుట్టుపక్కల ఉన్న 1500 గ్రామలకు పెనుముప్పుగా మారింది. అడవిని శరవేగంగా దహిస్తున్న దావానలం.. ఆదివారం నాటికి సమీపంలోని గ్రామాలపై విరుచుకుపడే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా జాతీయ విపత్తు నిరోధక దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌)కు చెందిన మూడు బృందాలను రంగంలోకి దింపింది.

ప్రస్తుతం అడవిలోని 50 ప్రాంతాల్లో కార్చిచ్చు వేగంగా విస్తరిస్తున్నది. మంటలు ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో సమీపంలోని ప్రజలకు, ఆస్తులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నారు. శుక్రవారం అడవిలో పుట్టిన ఈ మంటలు అదే రోజు రాత్రికి సమీపంలోని గ్రామాలకు పాకిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మంటలను అదుపు చేయడానికి గ్రామస్తులు, ప్రభుత్వ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం 135మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించింది. ఉత్తరాఖండ్‌లో శుక్రవారం నుంచి విస్తరిస్తూ.. స్థానికంగా భయాందోళనలు రేపుతున్న కార్చిచ్చుపై కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ.. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.
 

Advertisement
Advertisement