‘సరి-బేసి’పై సరిగమలు | Sakshi
Sakshi News home page

‘సరి-బేసి’పై సరిగమలు

Published Sun, Dec 27 2015 2:42 AM

‘సరి-బేసి’పై సరిగమలు - Sakshi

♦ వాద్రా వర్సెస్ ఆప్
♦ వీఐపీ వాహనాలకు మినహాయింపుపై వాద్రా విమర్శలు
 
 న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణకు సరి-బేసి ఫార్ములా తెచ్చిన ఢిల్లీ సర్కారుపై కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు. ఇందులోనూ వీఐపీల వాహనాలను మినహాయించడం ఏమిటని ప్రశ్నించారు. ‘ఏదైనా ఓ చట్టం తెస్తే సామాన్యులు, వీఐపీలు అన్న తేడా లేకుండా అందరూ దానికి కట్టుబడి ఉండాలి. కానీ సరి-బేసికి సంబంధించి రెండు జాబితాలు సిద్ధమవుతున్నాయి. ఇది కపటం కాదా?..’ అని ఫేస్‌బుక్‌లో ప్రశ్నించారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు వాహనాల నంబర్ల ప్రకారం.. సరి, బేసి వాహనాలను రోజు మార్చి రోజు నడిపేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చింది. దీన్ని జనవరి 1 నుంచి అమలు చేయనుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.2 వేల జరిమానా వేయాలని సర్కారు భావిస్తోంది.

వీఐపీ వాహనాలకు ఈ విధానం నుంచి మినహాయింపు కల్పించారు. కాగా, ‘వీలైతే ఏమైనా సాయం చేయండి, అంతేకానీ రాళ్లేయాలని చూడకండి. ఆయనే ఓ పెద్ద కపటి. ఆయనే కపటత్వం గురించి మాట్లాడుతున్నారు’ అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వాద్రాపై మండిపడింది. ‘ఇప్పటిదాకా ఆయన ఈ సమాజానికి ఏం చేశారో చెప్పాలి. కొత్త విధానంపై విమర్శలు చేసే బదులు అది విజయవంతం అయ్యేందుకు ఏమైనా సూచనలు చేయొచ్చు కదా..?’ అని పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement