‘నా అడ్రస్‌ మారిందే కానీ, డ్రెస్‌ మారలేదు’ | Sakshi
Sakshi News home page

‘నా అడ్రస్‌ మారిందే కానీ, డ్రెస్‌ మారలేదు’

Published Tue, Oct 17 2017 8:13 PM

venkaiah naidu speech at ap chamber of commerce

సాక్షి ప్రతినిధి, చెన్నై: పరిశ్రమ, వ్యవసాయం దేశాభివృద్దికి రెండు కళ్లువంటివని, వీటితో పాటు వాణిజ్య వ్యాపారాలు కూడా ఎంతో ముఖ్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. అన్ని రంగాల వారిలో జాతీయతాభావం పెరగాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 90వ వార్షిక వేడుకలు సోమవారం చెన్నైలోని ఒక ప్రైవేటు హోటల్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ... 'సంపదను పెంచితేనే పంచగలం, లేకుంటే పంచె మాత్రమే మిగులుతుంది. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత భారత ప్రభుత్వమే వ్యాపారం చేయకతప్పలేదు...మౌళిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత, వాటిని సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధి దిశగా తీసుకెళ్లడం పౌరుల కర్తవ్యమ'న్నారు.

'మీరు ఉపరాష్ట్రపతి అయ్యారు.. అన్నిచోట్లకూ రాలేరు కదా అని అడుగుతున్నారు. బందోబస్తుకు 25 మంది, అత్యవసర వైద్యసహాయం కోసం నలుగురు డాక్టర్లు, ఎయిర్‌ఫోర్సు విమానంలో ప్రయాణం అని ఏమేమో ఊహిస్తున్నారు. కొందరు నా పంచకట్టు గురించి కూడా అడుగుతున్నారు. నా అడ్రస్సు మారిందేగానీ డ్రస్సు మారదని చెప్పాను. మన సంస్కృతి సంప్రదాయాలను పాటించాలి, గౌరవించాలి. ఇప్పుడిప్పుడే వారు అర్థం చేసుకుంటున్నారు. వారితోపాటూ నేనూ ఈ పదవిని అర్థం చేసుకుంటున్నా. ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 90 ఏళ్ల వార్షికోత్సవం జరుపుకోవడం అంటే దాన్ని అపూర్వ విజయంగా పరిగణించాల్సి ఉంటుంద’ని అన్నారు.

వెంకయ్యకు స్టాలిన్‌ హితవు!
ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు రాజకీయాలు మాట్లాడటం విడ్డూరమని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. వెంకయ్య తన ప్రసంగంపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.    

Advertisement

తప్పక చదవండి

Advertisement