అశోక్ సింఘాల్ కన్నుమూత | Sakshi
Sakshi News home page

అశోక్ సింఘాల్ కన్నుమూత

Published Wed, Nov 18 2015 3:51 AM

అశోక్ సింఘాల్ కన్నుమూత - Sakshi

గుర్గావ్‌లోని ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస
 
♦ రామజన్మభూమి ఉద్యమంలో కీలక భూమిక
♦ ఆరెస్సెస్, వీహెచ్‌పీల్లో వివిధ హోదాల్లో విధులు
♦ సింఘాల్ మృతి వ్యక్తిగతంగా తీరని లోటన్న ప్రధాని మోదీ
 
 గుర్గావ్: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) సీనియర్ నేత, రామజన్మభూమి ఉద్యమ సారథి అశోక్ సింఘాల్ కన్ను మూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో బాధ పడుతున్న సింఘాల్(89) మంగళవారం మధ్యాహ్నం 2.24 గంటలకు స్థానిక మెడాంట మెడిసిటీ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రఇబ్బంది, ఇతర సమస్యలతో నవంబర్ 14న ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి కృత్రిమ శ్వాసపైననే ఉన్నారు. గుండె రక్త నాళాల వైఫల్యం, రక్తం విషపూరితం అవడమనే సమస్యల వల్ల సింఘాల్ మృతి చెందారని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా వెల్లడించారు.

సింఘాల్ మృతదేహాన్ని ఢిల్లీలోని జండేవాలన్‌లో ఉన్న ఆరెస్సెస్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ప్రజల సందర్శనార్ధం బుధవారం మధ్యాహ్నం 3 గం. వరకు సింఘాల్ మృతదేహాన్ని అక్కడే ఉంచుతామని, అనంతరం నిగంబోధ్ స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని తొగాడియా వెల్లడించారు. 1980 దశకం చివర్లలో ప్రారంభమైన రామజన్మభూమి ఉద్యమాన్ని దేశ, విదేశాల్లో విస్తృతం చేయడంలో అశోక్ సింఘాల్‌ది కీలక పాత్ర. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ‘కరసేవ’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా నిర్వహించారు. ఆ నేపథ్యంలోనే 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు విధ్వంస ఘటన చోటు చేసుకుంది. రామజన్మభూమి కోసం వీహెచ్‌పీ చేపట్టిన ప్రచారానికి విదేశాల నుంచి నిధులు సేకరించడంలో సింఘాల్ కృషి గణనీయమైనది.

 వ్యక్తి కాదు.. వ్యవస్థ: మోదీ
 అశోక్ సింఘాల్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సింఘాల్ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. దేశసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన అశోక్ సింఘాల్ ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థ అని అభివర్ణించారు. పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల వెనుక చోదక శక్తి సింఘాలేనని, ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు. సింఘాల్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన సానుభూతిని తెలిపారు. సింఘాల్ మృతి తననెంతో బాధకు గురి చేసిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సంతాపం తెలిపారు. ఐదు దశాబ్దాల ప్రజా జీవితం ఆయనను ఒక వ్యవస్థగా మార్చిందన్నారు. రాజస్తాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్, గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లి, గుజరాత్ సీఎం ఆనంది బెన్ పటేల్, రాజస్తాన్ బీజేపీ నేతలు, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్.. తదితరులు సింఘాల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సింఘాల్‌ను అజాత శత్రువుగా అభివర్ణించిన కళ్యాణ్ సింగ్.. ఆయన మృతి సమాజానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.

 బ్రహ్మచారి.. హిందూత్వ యోధుడు
 ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 1926 అక్టోబర్ 2న అశోక్ సింఘాల్ జన్మించారు. చిన్నతనం నుంచే హిందూత్వ విశ్వాసాలున్న సింఘాల్ 1942లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో చేరారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి మెటలర్జీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఆరెస్సెస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా పనిచేయడం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఆ తరువాత ఢిల్లీ, హర్యానాలకు ఆరెస్సెస్ ప్రాంత ప్రచారక్ అయ్యారు. 1980లో సంఘ్ పరివార్‌లో భాగమైన విశ్వహిందూ పరిషత్‌లో సంయుక్త ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. 1984లో వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తరువాత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితుడై డిసెంబర్ 2011 వరకు ఆ హోదాలో పనిచేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం లక్ష్యంగా సాగించిన రామ జన్మభూమి ఉద్యమాన్ని అన్నీ తానై నడిపించిన సింఘాల్.. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు.
 
 సింఘాల్ మృతికి రాష్ట్ర బీజేపీ నేతల సంతాపం
 సాక్షి, హైదరాబాద్: విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్‌సింఘాల్ మృతికి బీజేపీ రాష్ట్ర నేతలు సంతాపాన్ని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభపక్షం నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో తమ సానుభూతిని, దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు.

Advertisement
Advertisement