అశోక్ సింఘాల్ గృహ నిర్బంధం

24 Aug, 2013 05:55 IST|Sakshi
అశోక్ సింఘాల్ గృహ నిర్బంధం

ఫైజాబాద్/లక్నో: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు అశోక్ సింఘాల్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం గృహ నిర్బంధంలో పెట్టింది. వీహెచ్‌పీ ఆదివారం అయోధ్యకు సాధు, సన్యాసులతో తలపెట్టిన 84 కిలోమీటర్ల పాదయాత్రపై నిషేధం అమలులో భాగంగా, 70 మంది వీహెచ్‌పీ నేతలపై అరెస్టు వారంట్లు జారీ చేసింది. అవాంఛనీయమైన సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఫైజాబాద్-అయోధ్య జంట పట్టణాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసింది.

 

మత కలహాలు రేకెత్తే అవకాశాలు ఉన్నందున వీహెచ్‌పీ యాత్రపై నిషేధం విధించిన యూపీ సర్కారు, పొరుగు రాష్ట్రాలను ఈ అంశంలో ఇంటెలిజెన్స్ సహాయం కోరింది. అయోధ్యకు దారితీసే జిల్లా సరిహద్దులన్నింటినీ ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం మూసివేసింది. నిషేధాన్ని ఉల్లంఘించి అయోధ్య వైపు పాదయాత్రగా వచ్చే సాధువులను జిల్లా ప్రవేశ మార్గాల వద్దే అదుపులోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది.

మరిన్ని వార్తలు