రగులుతున్న మోగా! | Sakshi
Sakshi News home page

రగులుతున్న మోగా!

Published Sun, May 3 2015 2:43 AM

victims father demands to file case on deputy CM

  • బాలిక అంత్యక్రియలకు కుటుంబం ససేమిరా
  • డిప్యూటీ సీఎంపై కేసు పెట్టాల్సిందే: బాధితురాలి తండ్రి
  •  
    మోగా/చండీగఢ్: కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి ఆపై తల్లీబిడ్డలను కిందకు తోసివేసిన దారుణ ఘటన పంజాబ్‌లోని మోగా జిల్లాలో తీవ్రరూపం దాలుస్తోంది. ఈ ఘటనలో కన్నుమూసిన 16 ఏళ్ల అమ్మాయి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె కుటుంబీకులు ససేమిరా అంటున్నారు. బస్సు యజమానుదారుడైన డిప్యూటీ సీఎం, హోంమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కేసు నమోదుచేసి, ఆయనకు చెందిన ‘ఆర్బిట్ ఏవియేషన్’ సంస్థ రవాణా అనుమతులను రద్దు చేసేవరకు తమ పట్టు వీడబోమంటున్నారు. దీంతో శనివారం వరుసగా మూడోరోజు  జిల్లాలో ఉద్రిక్తత కొనసాగింది.
     
    తమ కుటుంబానికి రాజకీయనాయకుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున భద్రత కల్పించాలని బాలిక తండ్రి సుఖ్‌దేవ్ సింగ్ కోరారు. తమకు న్యాయం జరిగేంత వరకు కూతురు భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించబోమన్నారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టి, రాజీ కుదుర్చుకోవాలన్న ఒత్తిళ్లు వస్తున్నాయన్నారు. ‘ఆ బస్సు యజమానులపై కేసు పెట్టాలి. మాకు న్యాయం జరగాలి. అప్పటిదాకా నా కూతురుకు అంతిమ సంస్కారాలు చేయం. మా కుటుంబీకులకు రక్షణ కల్పిస్తున్నట్టు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వా’లన్నారు.
     
    బస్సుల నిలుపుదల: మోగా ఘటనపై ఆప్, కాంగ్రెస్ పార్టీల నుంచి విమర్శలు పెరగడంతో డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్(సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ తనయుడు).. తమ సంస్థకు చెందిన బస్సులన్నింటినీ నిలిపివేశారు. సంస్థ సిబ్బందిని శిక్షణ కోర్సుకు పంపారు. అంతకుముందు ఆప్ కార్యకర్తలు మోగాలో నిరసన ర్యాలీ నిర్వహించి, సీఎం, డిప్యూటీ సీఎంల దిష్టిబొమ్మలు దహనం చేశారు.
     
    ఆమె మరణం దైవేచ్ఛ: హరియాణా మంత్రి
    బాలిక మృతి చెందడం దైవేచ్ఛ అంటూ మంత్రి సుర్జీత్‌సింగ్ రఖ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రమాదాలను ఎవరూ ఆపలేరు. ఎప్పుడైనా ప్రమాదం జరగొచ్చు. దేవుడి రాత ప్రకారమే జరిగింది. దురదృష్టకరమే అయినా.. దేవుడి అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరం కూడా ముందుకు వెళ్లలేం’ అని  అన్నారు. దీనిపై  పార్టీలు మండిపడడంతో.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement