బతికుండగానే మీ ఆస్తిని రాయకండి! | Sakshi
Sakshi News home page

బతికుండగానే మీ ఆస్తిని రాయకండి!

Published Tue, Aug 15 2017 12:44 PM

Vijaypat Singhania Strong Message to Parents

  • ఆస్తి కేసులో వ్యాపారదిగ్గజం
  • చర్చలకు తనయుడు గౌతమ్‌ సిద్ధం
  • కుదరదంటూ విజయ్‌ మొండిపట్టు?
 
ముంబై: కోట్లకు పడగనెత్తి దేశంలో బిలీనియర్‌ జాబితాలో ఒకరిగా వెలుగొందిన విశ్రాంత వ్యాపారదిగ్గజం విజయ్‌పథ్‌ సింఘానియా ఇంటిపోరు కోర్టుకెక్కటం తెలిసిందే. వారసుడు, రేమండ్ సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ గౌతమ్‌ సింఘానియా తండ్రి నుంచి ఆస్తులు మొత్తం లాగేసుకుని రోడ్డు మీద పడేయటం, ఓ అద్దె కొంపలో దుర్భర జీవితాన్ని గడుపుతున్న ఆయన తన వాటా, భరణం కోసం కోర్టుకెక్కటంతో వ్యవహారం వెలుగుచూసింది. అయితే ఇలాంటి వాళ్లు ప్రతీ ఇంట్లో ఉంటారని.. అందుకే పిల్లలను గుడ్డిగా నమ్మకండంటూ విజయ్‌ తల్లిదండ్రులందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నారు.   
 
పుత్ర ప్రేమతో గౌతమ్‌ కు ఆస్తిలో వాటా ఇవ్వటం, వ్యాపార రహస్యాలను చెప్పటం, చివరకు విశ్రాంతి తీసుకోండి అన్న కొడుకు మాటను సలహాగా భావించి బిజినెస్‌ మొత్తం అప్పజెప్పటం, ఆపై ఓ అద్దె కొంపలో కాలం వెళ్లదీస్తుండటం.. కొడుకు చేతిలో మోసపోయానని తెలుసుకోవటానికి ఈ బిజినెస్ టైకూన్‌ కు ఎక్కువ సమయం పట్టలేదు. "79 ఏళ్ల ఈ వయసులో నేను కోర్టుకు ఎక్కాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. తలదాచుకునేందుకు ఆశ్రయం కూడా లేకపోవటంతోనే నా కుటుంబంపై పోరాటానికి సిద్ధమయ్యా. ఆస్తి మొత్తం రాసిచ్చాక నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. అంతేకాదు కంపెనీ డబ్బును సొంత అవసరాలకు వాడుకున్నా ఓపికపట్టా" అని ఆయన చెబుతున్నారు. 
 
"తల్లిదండ్రులకు చేసే విన్నపం ఒక్కటే. మీ పిల్లల్ని ప్రేమించండి. కానీ, అస్సలు నమ్మకండి. ప్రతీ పది మంది పిల్లలో ఆరుగురు మంచోళ్లు ఉండొచ్చు. ఒకరు మిమల్ని అమితంగా ఇష్టపడేవాళ్లు ఉండొచ్చు. కానీ, ఒక్కరైనా మోసం చేసేవాళ్లు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మీరు బతికి ఉన్నప్పుడు మీ ఆస్తి వాళ్ల పేరిట రాయకండి" అని విజయ్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు విజయ్‌ అనవసరంగా కుటుంబాన్ని కోర్టుకు లాగారని ఆరోపిస్తున్నారు తనయుడు గౌతమ్‌‌. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పినప్పటికీ తండ్రి వినటం లేదంటూ ఆయన తెలిపారు. 
 
మలబార్ హిల్‌లోని 36 అంతస్తుల జేకే హౌస్ భవంతిలో తనకు రావాల్సిన డూప్లెక్స్‌ను ఇప్పించాలని విజయ్‌ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించటంతోపాటు 18వ తేదీలోపు వివరణ ఇవ్వాలని రేమండ్ కంపెనీని జస్టిస్‌ గిరీష్‌ కులకర్ణి ఆదేశించారు. దీంతో గౌతమ్‌ తండ్రి వద్దకు మధ్యవర్తిలతో రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తన హక్కుల కోసమే పోరాడుతాను తప్ప జీవితంలో తిరిగి కొడుకు మొహం చూసే ప్రసక్తే లేదని విజయ్‌పథ్‌ ఖరాఖండిగా చెబుతున్నారు. 
 
                           జేకే హౌజ్‌ తో మొదలైన సింఘానియా ప్రస్థానం తర్వాత రేమండ్ లిమిటెడ్‌ సంస్థల అధిపతిగా బాధ్యతలు స్వీకరించాక పూలపాన్పు మీదే కొనసాగింది. వస్త్ర రంగంలో సవాళ్లను సలువుగా అధిగమించి ప్రతీనోట్లో రేమండ్‌ అనే బ్రాండ్ పేరును నానేలా ఆయన చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మ భూషణ్‌ పురస్కారంతోపాటు వ్యాపారవేత్తగా అరుదైన గౌరవాలు ఎన్నో అందుకున్నారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement