నమ్రత దామర్‌ది హత్యే! | Sakshi
Sakshi News home page

నమ్రత దామర్‌ది హత్యే!

Published Thu, Jul 9 2015 1:39 AM

నమ్రతా దామర్

వెలుగులోకి వ్యాపమ్ మృతురాలి అటాప్సీ రిపోర్ట్
* సీబీఐ దర్యాప్తుపై ‘సుప్రీం’ను కూడా ఆశ్రయిస్తాం
* రాజీనామా ప్రసక్తే లేదు; ఎంపీ సీఎం శివరాజ్
* నేడు సుప్రీంలో ‘వ్యాపమ్’ విచారణ

ఉజ్జయిన్/న్యూఢిల్లీ: వ్యాపమ్ స్కామ్‌లో భాగంగా.. అక్రమ పద్ధతుల్లో మెడికల్ సీట్ సంపాదించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటూ, 2012లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన నమ్రత దామర్‌ది హత్యేనని తాజాగా తేలింది.

ఇండోర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న నమ్రత.. ఈ స్కామ్‌లో తన పేరు బయటపడిన తరువాత 2012లో ఉజ్జయిన్‌లోని ఒక రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించింది. నాటి పోస్ట్‌మార్టం నివేదిక బుధవారం వెల్లడై సంచలనం సృష్టించింది. 2012, జనవరి 9నాటి ఆ నివేదికలో.. ‘బలంగా గొంతు నులమడం వల్ల శ్వాస ఆగిపోయి ఆమె మరణించింది. దీన్నిబట్టి ఇది హత్యగా భావించవచ్చు. ఆమె ముఖంపై చేతిగోర్లతో చేసిన గాయాలు కూడా ఉన్నాయి’ అని ఉంది. దీన్నిబట్టి ఇన్నిరోజులు భావిస్తున్నట్లు ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని స్పష్టమవుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

నమ్రత మృతిని మొదట హత్యకేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ తరువాత దాన్ని ఆత్మహత్య కేసుగా మార్చి, కేసును మూసేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నమ్రతది ఆత్మహత్యగా పేర్కొనలేదని పోస్ట్‌మార్టం పరీక్ష నిర్వహించిన ఉజ్జయిన్ జిల్లా ఆస్పత్రి వైద్యుల బృందం సభ్యుడు డాక్టర్ బీబీ పురోహిత్ స్పష్టం చేశారు. ఆమెపై లైంగికదాడి జరిగిందా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు అవసరమైన పరీక్షలు చేయాలని సూచించామన్నారు. నమ్రతది హత్యేనని తేల్చే పోస్ట్‌మార్టం నివేదిక వెలుగులోకి రావడంతో.. ఈ కేసు దర్యాప్తును పునఃప్రారంభిస్తామని తొలుత చెప్పిన పోలీసులు తర్వాత మాట మార్చారు.

కేసు దర్యాప్తు ముగిసిందని, నివేదిక ఇచ్చేశామని చెప్పారు.  వ్యాపమ్ మరణాల్లో ‘హత్య’కోణం ససాక్ష్యంగా వెలుగులోకి రావడం ఇదే ప్రథమం. నమ్రత మృతిపై పరిశోధన జరిపేందుకు వచ్చిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ శనివారం ఆమె తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసిన కాసేపటికే నురగలు కక్కుకుని చనిపోయిన విషయం గమనార్హం. ఆ తరువాతే ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. మరోవైపు,  స్కామ్‌ను సీబీఐకి అప్పగించాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టులో దాఖలైన పిల్‌కు సంబంధించి పిటిషన్‌దారుల తరఫున వాదించిన న్యాయవాది ఆదర్శ్ మున్నీ త్రివేదీ బుధవారం అస్వస్థతకు లోనయ్యారు.

హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన త్రివేదీ.. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అక్రమ అడ్మిషన్లకు సంబంధించిన మరో పిల్‌పై బుధవారం వాదించాల్సి ఉండగా, అనారోగ్యానికి గురయ్యారు. విషాహారం ప్రభావంతోనే  అనారోగ్యం పాలయ్యారని త్రివేదీ కుటుంబ సభ్యులు అనుమానం.
 
సీబీఐతో వేర్వేరు దర్యాప్తులు.. స్కాంపై వేరుగా.. అలాగే దానికి సంబంధించిన అనుమానాస్పద మరణాలపై వేరుగా.. ఇలా రెండు వేర్వేరు దర్యాప్తులను సీబీఐచే జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అనుమానాస్పద మరణాలపై సీబీఐ దర్యాప్తు గురించి రాష్ట్రప్రభుత్వం ప్రస్తావించలేదని విమర్శించింది. వ్యాపమ్‌పై తక్షణమే సీబీఐ దర్యాప్తునకు అదేశించకుండా శివరాజ్ సింగ్ నేరపూరిత జాప్యానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. ‘49 మంది అమాయకులు బలైన ఇంత భయంకరమైన స్కామ్‌పై ఇంతవరకు ప్రధాని మోదీ నోరు మెదపకపోవడం దారుణం’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌పీఎన్ సింగ్ విమర్శించారు.

స్కాంలో సీఎం పాత్ర ఉందనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని, ఈ విషయంపైనా కూలంకష దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. సీఎం పదవిలో శివరాజ్‌సింగ్ కొనసాగితే.. సీబీఐ దర్యాప్తు కూడా నిష్పక్షపాతంగా జరగబోదని అన్నారు. కాగా, ఇండోర్ జైల్లో వారం క్రితం ఒక వ్యాపమ్ నిందితుడు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవండంతో జైల్లో ఉన్న 17 మంది ఇతర వ్యాపమ్ నిందితులను మరో జైలుకు తరలించాలని అధికారులు యోచిస్తున్నారు. అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ అంతర అవయవాల శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం బుధవారం అధికారులు రోహిణిలోని కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు.

సంబంధిత పరీక్షల చేసే సౌకర్యాలు తమవద్ద లేవంటూ ఢిల్లీ ఎయిమ్స్ ఆ శాంపిల్స్‌ను వెనక్కు ఇవ్వడంతో మధ్యప్రదేశ్ పోలీసులు వాటిని రోహిణిలోని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తీసుకువెళ్లారు. ఢిల్లీలో చనిపోయిన జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ మృతదేహానికి ఢిల్లీలో బుధవారం పోస్ట్‌మార్టమ్ జరిపి అవయవ నమూనాలను  హైదరాబాద్‌లోని సీఎఫ్‌ఎస్‌ఎల్ కు పంపారు.
 
‘సీబీఐ’ బంతి సుప్రీం కోర్టులో..
సంచలనం సృష్టిస్తున్న వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలా? వద్దా? అనే అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. వ్యాపమ్ పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు విచారించనుందని పేర్కొంటూ.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మధ్య ప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు జూలై 20వ తేదీకి వాయిదా వేసింది. దాంతో, సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

అలాగే, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనపై కుట్ర జరుగుతోందని, వ్యాపమ్‌పై దర్యాప్తు పూర్తయిన తరువాత అన్ని విషయాలు బయటపడ్తాయని వ్యాఖ్యానించారు. సీబీఐ దర్యాప్తు కోరాలని తనను పార్టీ అగ్రనాయకత్వం ఆదేశించలేదని, అది తాను స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై పార్టీ నాయకులతో చర్చించేందుకు ఆయన బుధవారం ఢిల్లీ వచ్చారు. వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించిన బెయిళ్లు, ఇతర పిటిషన్ల విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు భావిస్తోంది.

Advertisement
Advertisement