చిన్నరైతులకు రుణమాఫీ చేయండి: హైకోర్టు | Sakshi
Sakshi News home page

చిన్నరైతులకు రుణమాఫీ చేయండి: హైకోర్టు

Published Thu, Mar 3 2016 4:11 PM

చిన్నరైతులకు రుణమాఫీ చేయండి: హైకోర్టు

చిన్న, సన్నకారు రైతులకు రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను రద్దుచేయాలని, లేదా రుణాలను వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు అనుమతించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. రైతులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నందువల్ల అత్యవసరంగా ఒక రైతు కమిషన్ ఏర్పాటుచేసి, పంటల బీమా పథకాన్ని అమలుచేయాలని తెలిపింది. భారతీయ గోవంశ్ రక్షణ్ సంవర్ధన పరిషత్ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ సురేశ్వర్ ఠాకూర్‌లతో కూడిన డివిజన్ బెంచి ఈ ఆదేశాలు జారీచేసింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా రైతులు వర్షాలపైనే ఆధారపడ్డారని కోర్టు వ్యాఖ్యానించింది. రైతుల కష్టాలను తీర్చేందుకు ఇంతవరకు సరైన వేదిక లేదని, వాళ్ల ప్రయోజనాలను కాపాడాటం ప్రభుత్వ బాధ్యత అని బెంచి తెలిపింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసే కమిషన్ల ప్రతిపాదనలను ఆమోదించాలని, ఒకవేళ ఆమోదించకపోతే అందుకు తగిన కారణాలు కూడా చెప్పాలని కోర్టు చెప్పింది. కనీసం రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని, కాని పక్షంలో వాటి మీద వడ్డీరేటును తగ్గించి, వాయిదాల్లో చెల్లించేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి తెలిపింది. కేసు తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. పట్టణ ప్రాంతాల్లో పశువల షెడ్లను కట్టేందుకు మూడు నెలల్లోగా పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, పశుసంవర్ధక శాఖలు ఒక్కోటి రూ. 5 కోట్ల చొప్పున కేటాయించాలని ఆయా శాఖల అదనపు ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement