Sakshi News home page

పైరసీ సినిమా చూసినా, డౌన్లోడ్ చేసినా..

Published Tue, Aug 23 2016 2:21 PM

పైరసీ సినిమా చూసినా, డౌన్లోడ్ చేసినా.. - Sakshi

ముంబై: ఇంటర్నెట్ లో బ్లాక్ చేసిన వెబ్సైట్ల నుంచి పైరసీ సినిమాలు డౌన్లోడ్ చేసినా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అంతేకాదు కఠిన చర్యలు తప్పవని ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ నుంచి హెచ్చరిక కూడా రావొచ్చు. కాపీరైట్ చట్టాన్ని ఉల్లఘించినట్టు రుజువైతే మూడేళ్ల జైలు, మూడు లక్షల రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది. 'డిష్యూమ్' హిందీ సినిమా నిర్మాతల ఫిర్యాదు మేరకు స్పందించిన బాంబే హైకోర్టు జూలైలో 134 వెబ్ లింకులను తీయించివేసింది. అంతేకాదు బ్లాక్ చేసిన వెబ్సైట్లు, లింకుల్లో పైరసీని సినిమాలు చూసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.

అయితే వినియోగదారుడు పొరపాటున బ్లాక్ చేసిన వెబ్సైట్ ను తెరిస్తే చర్యలు ఉండవని సీనియర్ న్యాయవాది వెంకటేశ్ ధోండ్ తెలిపారు. బ్లాక్ చేసిన వెబ్సైట్ లో పైరసీ సినిమా చూస్తే నేరంగా పరిణనిస్తారని స్పష్టం చేశారు. పైరసీ సినిమా వెబ్సైట్లను నిలిపివేసి, ఆ సందేశాన్ని నెటిజన్లకు కనబడేలా పెట్టాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఇలాంటి సైట్లను ఓపెన్ చేయడానికి ప్రయత్నించొద్దని సూచించారు. బ్లాక్ చేసిన వెబ్ సైట్లను ఓపెన్ చేస్తే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement
Advertisement