కావేరి పరవళ్లు | Sakshi
Sakshi News home page

కావేరి పరవళ్లు

Published Thu, Jul 24 2014 12:49 AM

కావేరి పరవళ్లు - Sakshi

సెకనుకు 50 వేల ఘనపుటడుగుల నీటి రాక
తీర గ్రామాల్లో అలర్ట్
పెరుగుతున్న మెట్టూరు నీటి మట్టం
అన్నదాతల్లో ఆనందం


కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు డెల్టా అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నారుు. కావేరి నది  పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో రాష్ట్రంలోకి నీటి రాక పెరిగింది. మెట్టూరు డ్యాం నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.  కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ తీర గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు.
 
సాక్షి, చెన్నై: వర్షాభావ పరిస్థితులు, కావేరి నదీ జల వివాదం వెరసి గత ఏడాది డెల్టా అన్న దాతలను ఆందోళనకు గురిచేసింది. ఎట్టకేలకు కర్ణాటక, కేరళలో కురిసిన వర్షాలు చివరి క్షణంలో అన్నదాతలను ఆదుకోవడం కొంత మేరకు ఊరటనిచ్చింది. ఈ ఏడాది సైతం వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతల్లో ఆందోళన రెట్టింపు అయింది. కావేరి నీరు రాకపోవడం, వివాదం ముదరడంతో కురువై సాగుబడి ప్రశ్నార్థకంగా మారింది. ఆశించిన మేరకు ఈ ఏడాది డెల్టా అన్నదాతలు సాగుకు ముందుకు రాలేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో నైరుతి ప్రభావంతో కర్ణాటకలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇది డెల్టా అన్నదాతలకు వరంగా మారింది. అక్కడి వర్షాలతో కృష్ణ రాజ సాగర్, కబిని డ్యాంలలోకి నీటి ఉధృతి పెరిగింది. దీంతో ఆ డ్యాంల నుంచి ఉబరి నీటిని బయటకు వదులుతున్నారు.
 
కావేరి ఉగ్ర రూపం:
కృష్ణరాజ సాగర్, కబిని డ్యాంల ఉబరి నీటికి తోడుగా కావేరి తీరంలో కురుస్తున్న వర్షాలతో, చిన్న చిన్న చెరువులు, కాలువల నుంచి వస్తున్న నీటితో ఆ నది నాలుగైదు రోజులుగా  పరవళ్లు తొక్కుతోంది. హొగ్నెకల్ జలపాతంలో నీటి ఉధృతి మరింత పెరగడంతో సందర్శకులను  అనుమతించడం లేదు. అలాగే, తెప్ప పడవల్లో విహారాన్ని నిషేధించారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం కావేరి మరింత ఉగ్రరూపం దాల్చింది. క బిని పూర్తిగా నిండిపోవడంతో గేట్లను ఎత్తి వేశారు. ఉబరి నీరు పూర్తిగా బయటకు పంపుతుండటంతో కృష్ణరాజ సాగర్‌లో పూర్తి స్థాయికి నీటి మట్టం చేరువవుతుండడంతో నీటి విడుదల శాతాన్ని పెంచారు. దీంతో ఈ రెండు డ్యాంల నుంచి తమిళనాడు వైపుగా సెకనుకు 70 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.

ఈ నీరు సాయంత్రానికి రెండు రాష్ట్రాల సరిహద్దులోని పులిగుండుల వద్దకు చేరింది. అయితే, సెకనుకు 50 వేల ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు మేల్కొన్నారు. రాత్రికి ఆ నదిలో సెకనుకు 60 వేల ఘనపుటడుగుల మేరకు నీళ్లు ప్రవహించే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. హొగ్నెకల్‌లో వరద పోటెత్తుతుండడంతో  సినీ ఫాల్స్, పెరియ ఫాల్స్, జవర్ ఫాల్స్, మెయిన్ ఫాల్స్‌ల్లో జలధార పోటెత్తుతోంది. ఇక, ఈ ఉధృతితో మెట్టూరు డ్యాంకు నీటి రాక పెరిగింది. వారం రోజుల్లో నీటి మట్టం పది అడుగులు పెరగ్గా, మంగళవారం రాత్రి నుంచి ఒకే రోజులో మూడు అడుగులు అదనంగా పెరిగింది. ప్రస్తుతం డ్యాం నీటి మట్టం 61 అడుగులకు చేరినట్టు అధికారులు పేర్కొంటున్నారు. సెకనుకు 20 వేలకు పైగా ఘనపుటడుగుల నీళ్లు డ్యాంలోకి వచ్చి చేరుతోంది.
 
అప్రమత్తం: కావేరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి ఉధృతి మరి కొన్నాళ్లు కొనసాగాలని దేవుళ్లను వేడుకుంటున్నారు. ఇదే రకంగా నీటి ఉధృతి మరో వారం పది రోజులు కొనసాగిన పక్షంలో మెట్టూరు నీటి మట్టం ఆశించిన స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. మెట్టూరు డ్యాంకు మరింతగా నీళ్లు వచ్చిచేరిన పక్షంలో సాగుబడికి నీళ్లు చివరి క్షణంలో అందుతాయన్న అన్న ఆశాభావంతో అన్నదాతలున్నారు. ఇక, కావేరి ఉధృతి మరింత పెరగనుండడంతో ఆ తీర గ్రామాల్లోని ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. కావేరి నదిలోకి వెళ్లొద్దని, కావేరి నది వైపుగా గ్రామాల్లోకి వెళ్లే మార్గాల్లో జాగ్రత్తగా వెళ్లాలని దండోరా వేయించే పనిలో పడ్డారు. నీటి ఉధృతి మరింతగా పెరిగిన పక్షంలో ఈ తీరంలోని మొదలి పన్నై, కోట మలై, రాణి పేట, కామరాజనగర్, మరపునం గ్రామాల ప్రజలకు ముప్పు తప్పదు. దీంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement