సరే.. సహకరిస్తాం! | Sakshi
Sakshi News home page

సరే.. సహకరిస్తాం!

Published Sun, Jun 22 2014 10:19 PM

సరే.. సహకరిస్తాం! - Sakshi

 ముంబై: తమ నివాసాలను కాపాడుకునేందుకు దశాబ్దకాలానికిపైగా పోరాటం చేసిన క్యాంపాకోలావాసులు గత్యంతరంలేక ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కలిసిన తర్వాత మున్సిపల్ అధికారులకు సహకరిస్తామని స్పష్టం చేశారు. దీంతో క్యాంపాకోలా కాంపౌండ్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేసేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సిబ్బందికి మార్గం సుగమమైంది. నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలని, చట్టానికి అంతా సహకరించాలని చవాన్ క్యాంపాకోలా వాసులతో చెప్పడంతోనే వారు వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు.
 
అయితే ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ విషయంలో క్యాంపాకోలా వాసుల డిమాండ్‌ను సీఎం సూచనప్రాయంగా అంగీకరించడంతోనే వీరంతా వెనక్కు తగ్గినట్లు సమాచారం.క్యాంపాకోలా హౌసింగ్ సొసైటీలో 96 ఫ్ల్లాట్లు అక్రమంగా నిర్మించారంటూ అత్యన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో బీఎంసీ అధికారులు కూల్చివేయాలని నిర్ణయించారు. గతంలో అనేక పర్యాయాలు బీఎంసీ సిబ్బంది వాటిని కూల్చివేసేందుకు వెళ్లారు. కాని తీవ్ర వ్యతిరేకత రావడంతో ఖాళీ చేతులతో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. అప్పటికే కొందరు నివాసులు కోర్టు తీర్పును గౌరవిస్తూ ఫ్లాట్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగతావారు మాత్రం కొన్ని రాజకీయ పార్టీలు, వివిధ రంగాల అండదండల మొండిగా అక్కడే ఉంటూ వచ్చారు. చివరకు నీటి, గ్యాస్ సరఫరా నిలిపివేస్తామని బీఎంసీ ప్రకటించింది.
 
అక్కడికి వెళ్లిన అధికారులను అడ్డుకోవడం, గేట్లు మూసివేసి లోపలికి రాకుండా చేయడం వంటి ఘటనలు గత నాలుగైదు రోజులుగా జరుగుతున్నవిషయం తెలిసిందే. సీఎం చవాన్ జోక్యంతో ఎట్టకేలకు సంవత్సరన్నర నుంచి జరుగుతున్న ఆందోళనకు తెరపడింది. దీంతో సోమవారం నుంచి అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి బీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు.
 
అసలేం జరిగింది...
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ఎమ్మెల్యే బాలా నాంద్‌గావ్కర్ ఆదివారం నివాసులతో కలిసి సీఎం చవాన్‌తో భేటీ అయ్యారు. సోసైటీలో అదనపు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ)ని వినియోగించి నివాసులకు ఫ్లాట్లు నిర్మించి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందుకు చవాన్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని చట్టపరంగా పరిశీలించాలని బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటేను ఆదేశించారు.
 
అంతేకాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, మీరు కూడా సహకరించాలని కోరడంతో అందుకు నివాసులు అంగీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే కూల్చివేత పనులను తప్పనిసరిగా చేపట్టాల్సి వస్తోందని, మానవతా దృక్పథంతోనే క్యాంపాకోలా వాసులు డిమాండ్ చేసినట్లుగా 67,000 చదరపు గజాలా ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్‌ను ఉపయోగించుకునే విషయాన్ని పరిశీలించాలని చెప్పినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
 
రాష్ట్రపతి వద్దకు..
క్యాంపాకోలా వివాదం చివరకు రాష్ట్రపతి వద్దకు కూడా వెళ్లినట్లు తెలిసింది. స్థానిక ప్రతినిథుల బృందం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసిందని సమాచారం. ఈ విషయమై క్యాంపాకోలా వాసి అంకిత్‌గార్గ్ మాట్లాడుతూ... ‘సమస్యను పరిష్కరించాలని రాష్ట్రపతి ప్రణ బ్ ముఖర్జీకి లేఖ రాశాం. తమ విషయంలో కరుణ చూపాలని కోరాం. నివాసాలను కూల్చివేస్తే వందలాదిమంది రోడ్డున పడతారని, వారిలో పిల్లలు, వృద్ధులు ఉన్నారని, వారందరికి కొత్తగా నివాసాలు దొరకడం ముంబై మహానగరంలో అంత త్వరగా సాధ్యం కాదని, జోక్యం చేసుకొని క్యాంపాకోలా వాసులకు ఊరటనివ్వాలని కోరామ’న్నారు.
 
 దీనిపై డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఆనంద్ వాఘ్రాల్కర్ మాట్లాడుతూ... ‘రాష్ట్రపతికి లేఖ రాసినా అక్కడి నుంచి ఎటువంటి సమాచారమైతే మాకు అందలేదు. దీంతో మా విధులు మేం నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుకోసం పోలీసు బలగాలను కూడా రంగంలోకి దింపాలని యోచిస్తున్నాం. సోమవారం కూల్చివేత పనులను కొనసాగిస్తామ’న్నారు.

Advertisement
Advertisement