మాది విపక్ష పాత్రే: కేజ్రీవాల్ | Sakshi
Sakshi News home page

మాది విపక్ష పాత్రే: కేజ్రీవాల్

Published Mon, Dec 9 2013 2:05 AM

we are opposition only : kejriwal

మాది విపక్ష పాత్రే: కేజ్రీవాల్
 ఢిల్లీలో ఏ పార్టీ మద్దతుతోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని జెయింట్ కిల్లర్, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆదివారం వెలువడ్డ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆప్ మట్టికరిపించిన అనంతరం మద్దతుదారులను, మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ ఫలితాలను చరిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలకు స్పష్టమైన సందేశమిది. కులం, మతం, అవినీతి, నేరాలు, ధన, కండ బలాలే ఇప్పటిదాకా ఈ పార్టీలను నడిపించాయి. ఇకనైనా సంస్కరణ బాట పట్టకుంటే ప్రజలే వాటిని ఇంటికి పంపుతారు’’ అన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కాదని, ప్రజా విజయమని అన్నారు.
 
  అవినీతిమయ రాజకీయాలకు, నీతి నిజాయితీలతో కూడిన రాజకీయాలకు మధ్య పోరాటం జరిగిందన్నారు. ఈ స్ఫూర్తితో ఢిల్లీ బయట కూడా విస్తరిస్తామని, మరింత క్రియాశీలకంగా మారతామని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటారా అని ప్రశ్నించగా లేదని బదులిచ్చారు. తమది విధాన, సైద్ధాంతిక పోరాటమే తప్ప షీలా దీక్షిత్‌తో వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వమూ లేదన్నారు. ఢిల్లీలో మోడీ ప్రభావం లేదని పేర్కొన్నారు.
 
 మూర్ఖులం: షీలా
 ‘మేం మూర్ఖులం, కదూ?’ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పందన ఇది. సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆదివారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రజల మనోగతాన్ని పసిగట్టలేకపోయారా అన్న ప్రశ్నకు పై విధంగా స్పందించారు. ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. పరాజయాన్ని అంగీకరిస్తున్నాం. పొరపాటు ఎక్కడ జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకుంటాం. 15 ఏళ్ల పాటు మాకు మద్దతుగా నిలిచినందుకు ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు’’ అన్నారు.
 
 శభాష్ కేజ్రీవాల్: హర్షవర్ధన్
 ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయానికి గాను అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ అభినందనలు తెలిపారు. తమ పార్టీకి విజయం కట్టబెట్టినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వారు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమన్నారు. ఢిల్లీ సీఎంగా 15 ఏళ్ల పాటు షీలా దీక్షిత్ సేవలందించారంటూ కొనియాడారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement