ఈ ఉద్యోగాలు మాకొద్దు! | Sakshi
Sakshi News home page

ఈ ఉద్యోగాలు మాకొద్దు!

Published Tue, Mar 8 2016 12:47 AM

ఈ ఉద్యోగాలు మాకొద్దు! - Sakshi

హక్కుల్ని గౌరవించాలి
న్యూఢిల్లీ: మహిళలకున్న గౌరవప్రదమైన జీవితం, సమాన అవకాశాలు పొందే హక్కుల్ని గౌరవించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలుపునిచ్చారు. మహిళల భద్రత, సమాజంలో గౌరవం కోసం సరైన వాతావరణం కల్పించే బాధ్యత అందరిపైనా ఉందని అంతర్జాతీయ మహిళా దినోత్సవ వర్తమానంలో ఆయన పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ఇన్నేళ్లుగా పాటుపడ్డ మహిళలకు రాష్ట్రపతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. లింగ వివక్షను రూపుమాపేందుకు, మహిళా సాధికారత కోసం అందరూ తమ తమ ప్రయత్నాల్ని రెండింతలు చేయాలని చెప్పారు. మహిళలు తమ శక్తిని తెలుసుకునేలా, దేశాభివృద్ధిలో పాలుపంచుకునేలా ఉత్తేజితుల్ని చేసేందుకు పాటుపడాలన్నారు.

పల్లె మహిళల కోసం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘మహిళ ఈ-హాత్’ వెబ్‌సైట్‌ను సోమవారం ప్రారంభించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ఈ సైట్‌లో ఎలాంటి రుసుం చెల్లించకుండానే మహిళలు తమ ఉత్పత్తుల్ని అమ్ముకోవచ్చు. దూరప్రాంతాలకు వెళ్లలేని గ్రామీణ మహిళల్ని దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశాన్ని కల్పించారు. దుస్తులు, సేంద్రియ ఉత్పత్తులు, బొమ్మలు వంటివి అమ్ముకునేందుకు మహిళలకు తాము సాయపడతామని మంత్రి మేనకాగాంధీ తెలిపారు. మహిళా దినోత్సవ కానుకగా ప్రార ంభిస్తున్నామని, ఇంతవరకూ ఏ శాఖా ఇలాంటి సదుపాయం కల్పించలేదన్నారు.
 
సమానత్వానికి..
 న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం, మహిళలకు వైద్య సాయం పెరిగేలా చూడాలని పలు ఆరోగ్య సంస్థలు పిలుపునిచ్చాయి. లింగ సమానత్వం ప్రధాన అంశంగా ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచమంతా మహిళలకు ఒకే రకమైన వైద్యసాయం అవసరముండగా.. అందరికీ అందడంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2015లో దక్షిణాసియా ప్రాంతంలో దాదాపు 61 వేలమంది గర్భిణులు ప్రసవ సమయంలో మరణించారని తెలిపింది. కట్టెలపొయ్యి పొగ వల్ల ప్రతి ఏడాది 16 లక్షల మంది మరణిస్తున్నారని డబ్ల్యుహెచ్‌వో దక్షిణాసియా ప్రాంతీయ డెరైక్టర్ చెప్పారు.
 
జీతాలు అంతంతే
ముంబై: దేశంలోని మహిళా ఉద్యోగుల్లో 28 శాతం జీతాల పట్ల అసంతృప్తిగా ఉన్నారని మైఖేల్ పేజ్ ఇండియా సంస్థ సర్వే వెల్లడించింది. అసంతృప్తిగా ఉన్న మగ ఉద్యోగులు 22 శాతంగా ఉన్నారని తెలిపింది. 300 మంది మహిళా ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించి ఈ వివరాలు వెల్లడిం చారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 23 శాతం మహిళలు సంపాదన పట్ల అసంతృప్తిగా ఉన్నా రు.  ఉద్యోగాన్వేషణలో భారతీయ మహిళలు తక్కువ ధీమాతో ఉండగా... మూడునెలల్లో ఉద్యోగం దొరకొచ్చని 68% ఆశాభావం వ్యక్తం చేశారు.  మగవారిలోలా ఉద్యోగా న్వేషణలో మహిళలకు జీతం ప్రాధాన్యం కాదని తెలిసింది.
 
ఈ ఉద్యోగాలు మాకొద్దు!
 న్యూఢిల్లీ: లింగ వివక్ష, కార్యాలయంలో వేధింపులు భరించలేక ఉద్యోగాలను మానేయాలని ఎక్కువ మంది మహిళలు భావిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అసోచామ్‌కు చెందిన సోషియల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ఈ సర్వే నిర్వహించిం ది. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, లక్నో, ముంబై, పుణె నగరాల్లో 500 మంది మహిళలపై ఈ సర్వే నిర్వహించారు. 25 శాతం మంది మహిళలు వేతన అంతరం, లింగ వివక్ష, భద్రతలేమి, ఉన్నత విద్యాభ్యాసం, సరిగాలేని పనివిధానం, కుటుంబ సమస్యలు తదితరాలను దీనికి కారణాలుగా చెప్పారు.
 
తక్కువ పొగుడుతారట!
వాషింగ్టన్: ప్రొఫెసర్లను విద్యార్థులు తరచూ మేధావులు, తెలివైన వారు అని పేర్కొంటారు. అయితే మహిళా ప్రొఫెసర్ల కన్నా పురుష ప్రొఫెసర్లనే విద్యార్థులు ఎక్కువగా పొగుడుతారని ఓ అధ్యయనంలో తేలింది. మహిళా ప్రొఫెసర్లు, ఆఫ్రికన్ అమెరికన్లను చాలా తక్కువ సార్లు మేధావులుగా పేర్కొంటారని తెలిపింది. ఈ పరిశోధన కోసం రేట్‌మైప్రొఫెసర్స్ డాట్‌కామ్ వెబ్‌సైట్‌లో తమ తమ ప్రొఫెసర్లపై దాదాపు 1.4 కోట్ల విద్యార్థుల అభిప్రాయాలు తీసుకున్నారు. ‘మహిళా ప్రొఫెసర్ల కన్నా పురుష ప్రొఫెసర్లనే ఎక్కువ సార్లు ‘జీనియస్’, ‘బ్రిలియంట్’ అని పేర్కొంటుంటారని మా అధ్యయనంలో తేలింది’ అని అమెరికాలోని ఇల్లినాయీ యూనివర్సిటీకి చెందిన డానియెల్
 స్టోరేజి చెప్పాడు.

Advertisement
Advertisement