282 స్థానాలకు పైనే గెలిచితీరుతాం | Sakshi
Sakshi News home page

282 స్థానాలకు పైనే గెలిచితీరుతాం

Published Sat, May 27 2017 1:49 AM

282 స్థానాలకు పైనే గెలిచితీరుతాం - Sakshi

2019 ఎన్నికలపై అమిత్‌ షా
న్యూఢిల్లీ:  వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ 2014లో సాధించిన మార్కు(282)ను సులభంగా దాటుతుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. గతంలో  విపక్ష పాలన ఉన్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో తమ ప్రభుత్వమే ఏర్పాటైందని, ఈ రెండు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, కేరళలోనూ ఈ సారి అధిక స్థానాలు దక్కించుకుంటామని శుక్రవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. ‘ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. కాంగ్రెస్, స్థానిక పార్టీల నుంచి పోటీ గట్టిగానే ఉండే అవకాశం ఉంది. అయినా మా గత స్కోరును కచ్చితంగా అధిగమిస్తాం’అని  అన్నారు.

జాతీయ రాజకీయాల్లో ఎన్నో మార్పులు తెచ్చామని.. అందుకే ప్రజలు యూపీలో పట్టం కట్టారన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో ఉత్తర, పశ్చిమ భారత్‌లో దాదాపు అన్ని స్థానాలు కైవసం చేసుకుంటాం. ఈశాన్య, దక్షిణ ప్రాంతంలో గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాం’ అని అన్నారు.  మోదీ మూడేళ్ల పాలనలో భారత్‌ ఆత్మగౌరవం, ఆశయం కోసం పనిచేయడం పెరిగిందన్నారు. దేశం ఆర్థికంగా వేగంగా ఎదుగుతోందని.. దీనికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చామని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంతో జీడీపీ  పెరుగుతోందన్నారు. 2024లోగా విద్యుత్‌ లేని గ్రామం.. మరుగుదొడ్డి లేని ఇళ్లు.. గ్యాస్‌ కనెక్షన్‌ లేని గృహం అంటూ ఉండదని.. ఇదే మోదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement