మరో హరిత విప్లవం తెస్తాం | Sakshi
Sakshi News home page

మరో హరిత విప్లవం తెస్తాం

Published Fri, Jul 11 2014 1:54 AM

మరో  హరిత విప్లవం తెస్తాం - Sakshi

సాగులో ఆధునిక పరిజ్ఞానానికి, యాంత్రీకరణకు పెద్దపీట
బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన

 
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి ఊతమిస్తూ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా నూతన ప్రణాళికను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్‌లో పొందుపరిచారు. ఇందులో సాగును యాంత్రీకరణ దిశగా నడిపించి పంట దిగుమతులు పెంచేందుకు పలు కార్యక్రమాలను ప్రకటించారు. మొత్తమ్మీద వ్యవసాయ రంగానికి జవసత్వాలు అందించి 4 శాతం వృద్ధిని సాధిస్తామని, రెండో హరిత విప్లవానికి నాంది పలుకుతామని తెలిపారు. బీడుగా పడి ఉన్న భూములను వ్యవసాయానికి అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు, భూసార పరిరక్షణ, పరిశోధన కార్యక్రమాలకు బడ్జెట్‌లో రూ.7,500 కోట్లు కేటాయించారు. అలాగే పంటలను నిల్వ చేసేందుకు శాస్త్రీయ పద్ధతిలో పెద్దఎత్తున గోదాములను అభివృద్ధి చేస్తామని, ఇందుకు రూ.5 వేల కోట్లు వెచ్చిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)లో సమూల మార్పులు తీసుకువస్తామని, ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. మార్కెట్‌లో పంటల ధరలు తగ్గిపోయినప్పుడు రైతులను ఆదుకునేందుకు ‘ధరల స్థిరీకరణ నిధి’ కింద రూ.500 కోట్లు ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించినా దీనిపై వ్యవసాయరంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఈ నిధి దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఏ మూలకు సరిపోతాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంకుల ద్వారా రైతులకు రూ.8 లక్షల కోట్ల రుణాలు ఇప్పిస్తామని ఆర్థికమంత్రి చెప్పారు. కిందటేడాది యూపీఏ సర్కారు తన బడ్జెట్‌లో రైతులకు రూ.7 లక్షల కోట్ల రుణాలు ఇప్పిస్తామని చెప్పగా.. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల రుణాలను లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ పథకాన్ని కొనసాగిస్తామని జైట్లీ పేర్కొన్నారు. దానికితోడు రూ.5 వేల కోట్ల కార్పస్ ఫండ్‌తో గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక రుణాలు అందిస్తామని వెల్లడించారు. ‘‘సాగును లాభసాటిగా మార్చేందుకు, ఇతర రంగాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు తక్షణమే ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పెంచాల్సిన అవసరముంది. అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి’’ అని జైట్లీ తన ప్రసంగంలో చెప్పారు. వ్యవసాయానికి కేటాయించిన రూ.7,500 కోట్లలో రూ.వెయ్యి కోట్లను ‘ప్రధానమంత్రి కృషి సించాయి యోజన’ పథకానికి ఇచ్చారు. ఈ పథకం కింద బీడు భూములను అభివృద్ధి చేయనున్నారు. ఇక రెండు రాష్ట్రాలుగా అవతరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొత్తగా వ్యవసాయ విద్యా సంస్థలను నెలకొల్పుతామని ప్రకటించారు.

బడ్జెట్ బాగుంది: నాబార్డ్

బడ్జెట్ బాగుందని నాబార్డ్(నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) చైర్మన్ హెచ్‌కే భన్వాలా పేర్కొన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి సముచిత ప్రాధాన్యం కల్పించారన్నారు.
 
బడ్జెట్‌లో సాగుకు కేంద్రం ఇచ్చిందేమిటంటే..
 
  ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం. తెలంగాణ, హర్యానాలో ఉద్యాన వర్సిటీని నెలకొల్పుతాం. ఇందుకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నాం.
 హా    భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) తరహాలో అస్సాం, జార్ఖండ్‌లలో రాష్ట్రానికి ఒకటి చొప్పున రూ.100 కోట్లతో రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేస్తాం.
    రూ.100 కోట్లతో అగ్రి-టెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తాం.
    సాగుభూమి లేని 5 లక్షల కౌలు రైతుల బృందాలకు నాబార్డ్ ద్వారా ఆర్థికసాయం అందజేస్తాం. రైతులకు రుణాలు అందుబాటులో ఉండేలా చూసేందుకు సహకార బ్యాంకులకు నాబార్డ్ ద్వారా విడతల వారీగా రూ.50 వేల కోట్లు అందిస్తాం.
►    భూసార పరిరక్షణకు పెద్దపీట వేస్తాం. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం. భూసారానికి సంబంధించి రైతులందరికీ ప్రత్యేక కార్డులు అందజేస్తాం. రూ.56 కోట్లు వెచ్చించి దేశవ్యాప్తంగా మరో 100 సంచార భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.
   వర్షాభావ పరిస్థితుల్లో పంటల దిగుబడులు తగ్గిపోయినా ప్రజాపంపిణీ ద్వారా సరుకులను అందజేస్తాం.
  విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకాన్ని నియంత్రించేందుకు కొత్త యూరియా విధానాన్ని తీసుకువస్తాం.
    దేశీయ పాడి పశువుల అభివృద్ధికి రూ.50 కోట్లు వెచ్చిస్తాం. మత్స్యసంపద పెంచేందుకు మరో  రూ.50 కోట్లు కేటాయిస్తున్నాం.
 
రైతన్నల కోసం ‘టీవీ-కిసాన్’

న్యూఢిల్లీ: ఆరుగాలం శ్రమించే అన్నదాతల కోసం ‘టీవీ-కిసాన్’ పేరిట 24 గంటల టీవీ చానల్‌ను ఈ సంవత్సరమే ప్రారంభించనున్నారు. దీని ఏర్పాటుకుగాను బడ్జెట్‌లో రూ.100 కోట్లను కేటాయించారు. కిసాన్ టీవీలో.. వ్యవసాయ సంబంధిత సమాచారం, పంటల మెళకువలు, సాంకేతిక, పర్యావరణ పరిజ్ఞానం, జల వినియోగం, వాతావరణ పరిస్థితులు వంటివి 24 గంటలూ ప్రసారం కానున్నాయి. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రాల ప్రజల కోసం ‘అరుణ ప్రభ’ పేరుతో మరో 24 గంటల టీవీ చానల్‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. కాగా, కమ్యూనిటీ రేడియోను పరిపుష్టం చేసేందుకు రూ.100 కోట్లతో 600 కొత్త రేడియో స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. సమాచార, ప్రసార శాఖకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 3,316 కోట్లు కేటాయించింది.

నూనె చెక్కలపై సుంకం రద్దు

పశువులు, కోళ్లకు దాణాగా ఉపయోగించే తెలగపిండి వంటి నూనె చెక్కలపై ప్రస్తుతమున్న 15 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ చెక్కలపై సుంకం వసూలు చేయబోమన్నారు. ఈ చర్యతో దాణా ధరలు దిగొస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
 
యూరియూ వినియోగానికి కళ్లెం!
http://img.sakshi.net/images/cms/2014-07/81405024920_Unknown.jpg

న్యూఢిల్లీ: యూరియూ అధిక వినియోగానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యూరియూ విధానానికి రూపకల్పన చేయనుంది. ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం యూరియూ.. ఉత్పత్తి ఆధారిత సబ్సిడీ (పీబీఎస్) విధానంలో ప్రతి టన్ను యూరియూకు రైతులు గరిష్ట స్థిర చార్జీ రూ.5,360 మాత్రమే చెల్లిస్తుండటం,  ప్రభుత్వం సబ్సిడీ కింద టన్నుకు రూ.11,760 చొప్పున చెల్లిస్తుండటంతో భారీగా నిధులు వృథా అవుతున్నట్లు ఆర్ధిక సర్వే వెల్లడించిన నేపథ్యంలో కొత్త యూరియూ విధానానికి కేంద్రం రూపకల్పన చేయనున్నట్టు జైట్లీ తెలిపారు. వివిధ రకాల ఎరువుల వినియోగంలో సమతూకం లోపించడం వల్ల భూసారం తగ్గుతుండటంపై కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు జైట్లీ తన ప్రసంగంలో చెప్పారు.
 
పొలాలకు ప్రత్యేక ‘పవర్’  http://img.sakshi.net/images/cms/2014-07/61405025024_Unknown.jpg

న్యూఢిల్లీ: వ్యవసాయ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు గుజరాత్‌లో అనుసరిస్తున్న విధానాన్ని పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్తు మౌలిక వసతులను వేరు చేసేందుకు బడ్జెట్‌లో కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు ఫీడర్లను వేరు చేసేందుకు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన’ పథకం కింద నిధులు ఇచ్చారు. గ్రామాల్లో విద్యుత్తు లైన్లు, సబ్-ట్రాన్స్‌మిషన్, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటం దీని లక్ష్యమని అరుణ్‌జైట్లీ తెలిపారు. ఢిల్లీలో విద్యుత్తు కోతలు లేకుం డా సంస్కరణలు చేపట్టేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తామని, నీటి కొరత లేకుండా చర్యల కోసం మరో రూ.500 కోట్లు ఇస్తామన్నారు. విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలకు పదేళ్లపాటు టాక్స్ హాలిడే(2017 మార్చి 31 నుంచి వర్తిస్తుంది).
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement