'భారత్ ఏం చేసినా కరెక్టే.. మేం మద్దతిస్తాం' | Sakshi
Sakshi News home page

'భారత్ ఏం చేసినా కరెక్టే.. మేం మద్దతిస్తాం'

Published Thu, Sep 29 2016 2:58 PM

'భారత్ ఏం చేసినా కరెక్టే.. మేం మద్దతిస్తాం'

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏం చేసినా న్యాయమేనని బెలూచిస్తాన్ మద్దతుదారులు అన్నారు. ఉగ్రవాదాన్ని ఏరి పారేసేందుకు భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మద్దతిస్తామని చెప్పారు. భారతదేశంలో పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ భూభాగంలోకి మూడు కిలోమీటర్ల మేర చొరబడి.. అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై 'నిర్దేశిత దాడులు' (సర్జికల్ స్ట్రైక్స్) చేసింది.

పాక్ భూభాగంలోనే తాము ఈ దాడులు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ నేరుగా ప్రకటించారు కూడా. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చేసిన ఈ దాడులను ఇప్పటికే అంతర్జాతయ సమాజం మద్దతిస్తున్న నేపథ్యంలో తాజాగా బెలూచిస్తాన్ మద్దతుదారులు భారత్ వైపు మరోసారి తమ గొంతు వినిపించారు.

గురువారం మధ్యాహ్నం కొంతమంది బెలూచిస్తాన్ మద్దతుదారులు మజ్దాక్ దిల్సాద్ బాలోచ్ అనే నాయకుడి ఆధ్వర్యంలో పాక్ హైకమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత్ ఏం చేసినా సరైనదేనని, తాము ఇలాంటి దాడులకు మద్దతిస్తామని, ఇలాంటి దాడులు తమ ప్రాంతంలో కూడా భారత్ నిర్వహించాలని కోరారు.

Advertisement
Advertisement