మన దేశంలోనే పరాయి బతుకులు | Sakshi
Sakshi News home page

మన దేశంలోనే పరాయి బతుకులు

Published Wed, Apr 8 2015 3:21 AM

West Pakistan Refugees suffering

కాశ్మీర్: వారు మన దేశంలో పరాయి బతుకీడుస్తున్నారు. కడు దరిద్య్రంలో చావలేక బతుకుతున్నారు. వారిలో ఎవరికి చదువుకునే అవకాశాలు ఉండవు. చదువుకున్నా ఉద్యోగాలివ్వరు. కడుపునింపుకోవడానికి కూలీనాలి చేసుకోవాల్సిందే. ఆస్తుల సంగతి అలా వదిలేస్తే గుడిసేసుకునే స్థలాన్ని కూడా కొనుక్కునే హక్కు లేదు. కనీసం ఓటు హక్కు కూడా లేదు. వారే కాశ్మీర్‌లో ‘పశ్చిమ పాకిస్థాన్ కాందిశీకులు’గా ముద్రపడిన హిందువులు. రాష్ర్టంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపి ఉన్నందున భవిష్యత్తులోనైనా తమ బతుకుమారుతుందేమో చూడాలంటున్నారు మంగు  రామ్ అనే 70 ఏళ్ల వృద్ధుడు. ‘నా వయస్సయిపోయింది. పిల్లలు, వారి పిల్లలైనా బాగుంటే నాకదే చాలు’ అంటున్నాడు మంగా రామ్. కాశ్మీర్‌లో మంగారామ్‌లాంటి వారు దాదాపు లక్ష మంది ఉంటారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. దేశ విభజన సందర్భంగా జరిగిన మత కలహాల్లో వారంతా ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చిన వారు. మత కలహాల కారణంగా లక్షలాది మంది ప్రజలు భారత్ సరిహద్దు నుంచి పాకిస్థాన్‌కు, పాక్ సరిహద్దు నుంచి పాకిస్థాన్‌కు వలసలు వెళ్లారు. ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కు వలసవెళ్లిన వారిని పాక్ ప్రభుత్వం మనలాగా ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడం లేదు. వారికి ఆస్తి హక్కుతోపాటు ఓటు హక్కు కూడా కల్పించింది. ఇతర పౌరులతోపాటు సమాన హక్కులు ఇచ్చింది.


దేశానికి స్వాతంత్య్రం లభించి 68 ఏళ్లయిన పశ్చిమ పాక్ నుంచి వచ్చిన ఈ హిందువుల పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదు. కాశ్మీరులో ఎన్ని ప్రభుత్వాలు మారిన వారి రాత మార్చేందుకు ఏ ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఎన్నోసార్లు ఈ అంశం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చినా 370వ అధికరణ కింద కాశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు ఉన్నందున తామేమి చేయలేమంటూ చేతులెత్తేసింది. కాశ్మీర్‌లో మెజారిటీలు ముస్లింలు అవడం వల్ల మెజారిటీలో తేడా రాకూడదనే ఉద్దేశంలో కాందిశీకులుగా ముద్రపడిన హిందువులకు పౌరులుగా గుర్తించేందుకు రాజ్యాంగంలోని 370వ అధికరణం అడ్డుపడుతోంది.

Advertisement
Advertisement