మోదీ వ్యాఖ్యలో మర్మమేమిటీ? | Sakshi
Sakshi News home page

మోదీ వ్యాఖ్యలో మర్మమేమిటీ?

Published Wed, Dec 23 2015 3:44 PM

మోదీ వ్యాఖ్యలో మర్మమేమిటీ? - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి ఇటీవల బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య వెనక మర్మమేమిటీ గురువా? అన్న అంశంపై ఇప్పుడు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. హవాలా కేసులో ఇరుక్కున్న పార్టీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ లాగా అరుణ్ జైట్లీ కూడా విజయోత్సాహంతో కేసు నుంచి బయటకు వస్తారని మోదీ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. హవాలా కేసులో అద్వానీ ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు 1996 తన లోక్‌సభ స్థానానికి ఆయన రాజీనామా చే శారు. కోర్టు విచారణను ఎదుర్కొన్నారు. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఆయనపై కేసును కోర్టు కొట్టివేసింది.
 

అలాగే జైట్లీ కూడా తన పదవికి రాజీనామా చేసి, కోర్టు విచారణను ఎదుర్కోవాలని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని రావాలన్నది మోదీ ఇచ్చిన సందేశమని కొంతమంది పార్టీ నాయకులు భావిస్తున్నారు. జైట్లీపై కాంగ్రెస్, ఆప్ చేస్తున్న విమర్శలను ఖండించిన మోదీ సొంత పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్, జైట్లీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆరోపణలను ఖండించకపోవడం, ఆయన్ని మందలించకపోవడమే మోదీ వ్యాఖ్యలోఉన్న గూఢార్థాన్ని సూచిస్తోందని వారంటున్నారు. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ చైర్మన్‌గా వ్యవహరించిన అరుణ్ జైట్లీపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆరెస్సెస్ నాయకుడు మోహన్ భగవత్ ‘వ్యక్తికన్నా పార్టీ ప్రతిష్ట ముఖ్యం’ అని వ్యాఖ్యానించడం కూడా ఇక్కడ గమనార్హమే.
 

కొంతకాలంగా ఆరెస్సెస్ నాయకత్వానికి దూరంగా ఉన్న నరేంద్ర మోదీ బీహార్ ఎన్నికల పరాజయంతో మళ్లీ నాయకత్వానికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని, జైట్లీ పట్ల వారి ఉద్దేశం ఏమిటో కనుగొనేందునే అద్వానీ వ్యవహారంతో జైట్లీని పోలుస్తూ వ్యాఖ్యానించారని పార్టీలో ఓ వర్గం భావిస్తోంది. ఆరెస్సెస్ కోరితే జైట్లీ రాజీనామాను కోరేందుకు మోది సిద్ధంగా ఉన్నారన్నది వారి కథనం. జైట్లీ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్షం పార్లమెంట్‌లో నానా యాగి చేస్తున్నప్పటికీ ఒక్క కేబినెట్ మంత్రి కూడా ఆయన పక్షాన నిలబడక పోవడమూ తమ వాదనకు బలం చేకూరుస్తోందని ఆ వర్గం చెబుతోంది.
 

ప్రధాని మోది ఉద్దేశం ఏదైనప్పటికీ ఆయనది సదుద్దేశమేనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మీడియా సాక్షిగా చెబుతూ వస్తున్నారు. అప్పడు హవాలా కేసులో అద్వానీని ఇరికించాలనే కాంగ్రెస్ వ్యూహం తిప్పికొట్టిందని, అలాంటి వ్యూహం నుంచే ఇప్పుడు జైట్లీ కూడా విజయోత్సాహంతో బయటకు వస్తారన్నది ఆయన విశ్వాసమన్నది వెంకయ్య నాయుడి వ్యాఖ్యానం.

 

Advertisement
Advertisement