కేరళలోని ఓ ఇంట్లో కాస్ట్రో, చే, వాలెంతీనా | Sakshi
Sakshi News home page

కేరళలోని ఓ ఇంట్లో కాస్ట్రో, చే, వాలెంతీనా

Published Sat, Jun 11 2016 7:24 PM

కేరళలోని ఓ ఇంట్లో కాస్ట్రో, చే, వాలెంతీనా

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో ఓ ఇంట్లో  ఫిడెల్‌ కాస్ట్రో, చే గువేరా, వాలెంతినా తెరిస్కోవా పుట్టి పెరిగారంటే అదేమిటంటూ అందరికి ఆశ్చర్యం వేస్తుంది. పుట్టి పెరిగిందీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రముఖ విప్లవకారులు కాదు. మనలాంటి మామూలు మనుషులే. వారికి ఇలాంటి పేర్లు పెట్టారంటే ఆ తండ్రి ఏ పార్టీకి చెందిన వారో ఊహించడం కష్టమేమి కాదు. చివరి వరకు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్ముకొని బతికిన జీ. మణియన్‌. సోవియట్‌ యూనియన్‌ విరాజిల్లుతున్న రోజుల్లో, క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్‌ కాస్ట్రో అమెరికాను గడగడలాడిస్తున్న రోజుల్లో పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే ఎవరూ ఆశ్చర్యపోయి ఉండేవారు కాదు. 1990 దశకంలో పుట్టిన వారికి ఇలాంటి పేర్లు పెట్టడం విచిత్రమే కాకుండా సాహసం కూడా.

చే గువెరా తిరువనంతపురంలోని కజాకొట్టం ప్రభుత్వ స్కూల్లో 11వ తరగతిలో చేరినప్పుడు ఆయన పేరు విన్న టీచరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారట. విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో చే గువెరా తన పేరు చెప్పినప్పుడు ఓ లేడీ టీచర్‌ ఏంటీ అంటూ, తొలుత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారట.

మళ్లీ పేరు చెప్పుమని అడగ్గా చే గువేరా అని చెప్పడంతో ఆమె తన నవ్వు ఆపుకోలేకపోయారు. అన్నదమ్ములైన కాస్ట్రో, చే, చెల్లెలు వాలెంతీనా పేర్లు విన్నప్పుడు కొత్త వారు వింతగా చూసేవారట. పేర్లకు తగ్గంటే అన్నదమ్ములిద్దరూ విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కాలేజీల్లో కూడా పలు ఉద్యమాలు చేశారు. తండ్రి తన పిల్లలను ఇతర పార్టీ నాయకులకు పరిచయం చేసినప్పుడు ‘ఎంత ధైర్యం’ అంటూ వారు విస్తుపోయేవారట.

చే గువేరా ఉద్యోగం కోసం ఓ ప్రైవేటు కంపెనీకి వెళ్లినప్పుడు వింత అనుభవం ఎదురైందట. ఇంటర్వ్యూలో పేరు విన్న వెంటనే నిర్వాహకులు విస్తుపోయారట. ఉద్యోగం ఇస్తే కంపెనీలో సమ్మెలు చేస్తావా? అని కూడా ప్రశ్నించారట. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే చేస్తానని కూడా చెప్పారట. అయినా ఉద్యోగం ఇచ్చారట. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి ల్యాబ్‌లో టెక్నీషయన్‌గా పని చేస్తున్న కాస్ట్రోను మాత్రం అందరూ గ్యాస్ట్రో అనుకొని పొరపాటు పడతారట. ఇక వాలెంతీనా తెరిస్కోవా పేరు గురించి అందరికి పెద్దగా తెలియదుగనుక ఏమనే వారు కాదటగానీ వింత పేరని ఆశ్చర్య పోయే వారట. ప్రపంచంలోనే మొట్టమొదట రోదసిలో ప్రయాణించిన వ్యోమగామిగానే చరిత్ర సృష్టించడమే కాకుండా రష్యా కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలక నాయకురాలిగా వాలంతీనా తెరిస్కోవా పనిచేసిన విషయం తెల్సిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement