‘మోదీ కేర్‌’లో ఎవరి కేర్‌ ఉంది?! | Sakshi
Sakshi News home page

‘మోదీ కేర్‌’లో ఎవరి కేర్‌ ఉంది?!

Published Mon, Feb 5 2018 2:55 PM

whose care in modicare - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పదివేల పేద కుటుంబాల కోసం బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఆరోగ్య రక్షణ పథకాన్ని ఇప్పుడు మోదీకేర్‌గా విస్తత ప్రచారం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారా? లేదా 2019లో జరగాల్సిన పార్లమెంటరీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారా? అన్న అంశంపై కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని, అలాంటప్పుడు బడ్జెట్‌లో ఈ పథకానికి కేవలం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఏమిటని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

ప్రతిపక్షాల ప్రశ్నను పక్కన పెడితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాల ప్రకారం పదివేల కుటుంబాలకు ఐదేసి లక్షల రూపాయల ఆరోగ్య బీమాను వర్తింప చేయాలంటే ఏడాదికి 30 వేల కోట్ల రూపాయలు కావాలి. ఆ లెక్కన చూసుకున్నా రెండు వేల రూపాయలు ఏ మూలకు సరిపోవు. ఈ పథకం కింద తదుపరి కేటాయింపులు ఎప్పుడు ఉంటాయో, ఎంత ఉంటాయో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ పథకాన్ని ఖరారు చేయడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని ఆర్థిక కార్యదర్శి హాస్ముఖ్‌ ఆదియా బడ్జెట్‌ ప్రతిపాదనల అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత స్కీమ్‌ గురించి ఆరోగ్య బీమా కంపెనీలతో చర్చలు జరపడానికి మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. అంటే, ఈ సంవత్సరంలో ఆ ఆరోగ్య స్కీమ్‌ అమలు కాకపోవచ్చమాట.

వాస్తవానికి ఈ పథకం కొత్తదేమీ కాదు. రాష్ట్రీయ ఆరోగ్య స్కీమ్‌ కింద కుటుంబానికి 30 వేల రూపాయల ఆరోగ్య బీమాతో 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని గురించి ప్రస్తావించకుండా 2016 బడ్జెట్‌ ప్రతిపాదనల సందర్భంగా ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రతి పేద కుటుంబానికి 1.5 లక్షల రూపాయలతో ఆరోగ్య బీమా కల్పిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఈ స్కీమ్‌ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ అదే స్కీమ్‌ను తిరగేసి ప్రతి పేద కుటంబానికి 5 లక్షల రూపాల ఆరోగ్య రక్షణ స్కీమ్‌ అంటూ ప్రజల ముందుకు వచ్చారు. రెండేళ్లపాటు ఈ స్కీమ్‌ను అమలు చేయని బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు మాత్రం నిజాయితీగా ఈ స్కీమ్‌ను అమలు చేస్తుందా? చేసేదుంటే కేవలం రెండువేల కోట్ల రూపాయలను మాత్రమే ప్రకటించడం ఏమిటీ? అన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న.

దేశంలో మొత్తం ఆరోగ్య రంగానికి 2017–18 ఆర్థిక సంవత్సరానికి 48,878 కోట్ల రూపాయలను కేటాయించారు. సవరించిన అంచనాల ప్రకారం ఆ కేటాయింపులు 53,198 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సంవత్సరానికి అదే ఆరోగ్య రంగానికి 54,667 కోట్ల రూపాయలను కేటాయించారు. గత బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే 11.8 శాతం, సవంరించిన బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే కేటాయింపులు కేవలం 2.7 శాతం పెరిగాయి. జీడీపీతో కేటాయింపులను పోలిస్తే పెరగాల్సిన కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. పైగా ప్రపంచంలోనే ఓ ప్రభుత్వం చేపడుతున్న ఈ ఆరోగ్య పథకం అతి పెద్దదని అరుణ్‌ జైట్లీ గర్వంగా చెప్పుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కోసం 2005లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జాతీయ హెల్త్‌ మిషన్‌’ కింద ఏటా 30 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులను ఖర్చు పెడుతున్నారు. అప్పుడు ఆ పథకం పెద్దదవుతుందా? ఇప్పుడు చెబుతున్న ఈ పథకం పెద్దదవుతుందా? నిజంగా ఇదే పెద్దదయితే అంతకన్నా నిధులను ఈ స్కీమ్‌కు ఎక్కువ అవసరం అవుతాయికదా! మనకన్నా అధిక జనాభా కలిగిన చైనా తమ దేశ పౌరులందరికి ఐదు లక్షలు, పది లక్షలు అంటూ పరిమితి అనేది లేకుండా నూటికి నూరు శాతం (ఎంత ఖర్చయితే అంత) ఆరోగ్య బీమాను అమలు చేస్తోంది. అప్పుడు అది పెద్ద స్కీమ్‌ అవుతుందా? మనది పెద్ద స్కీమ్‌ అవుతుందా?

ప్రతి కుటుంబానికి ఐదులక్షల వరకు బీమా సౌకర్యం కల్పించడంలో కూడా మతలబు ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆధునిక యుగంలో ఓ కుటుంబం ఆరోగ్య అవసరాలకు ఏడాదికి లక్షన్నర రూపాయలు చాలట. అంటే మిగతా మూడున్నర లక్షల రూపాయలను బీమా సంస్థలు లేదా కార్పొరేట్‌ ఆస్పత్రులు లేదా రెండింటికి లాభాల కింద ముట్టచెబుతామన్నది వైద్య నిపుణుల అంచనా. మరి ‘మోదీకేర్‌’లో ఎవరి కేర్‌ ఎక్కువ ఉన్నట్టు?!

Advertisement

తప్పక చదవండి

Advertisement