పోలీసుల్ని ఎందుకు అనుమతించారు? | Sakshi
Sakshi News home page

పోలీసుల్ని ఎందుకు అనుమతించారు?

Published Mon, Feb 22 2016 1:45 AM

పోలీసుల్ని ఎందుకు అనుమతించారు? - Sakshi

‘జేఎన్‌యూ’పై తత్వవేత్త చామ్‌స్కీ లేఖ
 

 న్యూఢిల్లీ: చట్టపర చర్యలు అవసరంలేదని భావించినప్పుడు జేఎన్‌యూలోకి పోలీసులను ఎందుకు అనుమతించారంటూ ప్రముఖ తత్వవేత్త నోమ్ చామ్‌స్కీ ప్రశ్నించారు. వీసీ జగదీశ్ కుమార్‌కు ఆయన ఈమేరకు  ఈ మెయిల్ పంపారు. తాము పోలీసులను పిలవలేదని, చట్టప్రకారం సహకారం మాత్రమే అందించామని వీసీ ఇంతకముందే ప్రకటించారు. విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు మద్దతుగా కాలిఫోర్నియా, యేల్ యూనివర్సిటీ విద్యార్థులు ఇంటర్నెట్‌లో వీడియోలు అప్‌లోడ్ చేశారు.

 ఢిల్లీలో భారీ ర్యాలీ.. జేఎన్‌యూలో దేశ వ్యతిరేక కార్యక్రమాల్ని నిరసిస్తూ ఆర్మీ మాజీ ఉద్యోగులు, వేలాది మంది ప్రజలు న్యూఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. ‘వందేమాతరం, భారత్ మాతా కి జై’ అని నినాదాలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల సహకారంతోనే ఈ కార్యక్రమం జరిగింద ంటూ వచ్చిన వార్తల్ని నిర్వాహకులు ఖండించారు.

 కన్హయ్య, గిలానీపై కోర్టుధిక్కార పిటిషన్
 కన్హయ్య, ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ గిలానీపై కోర్టుధిక్కారం కింద చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అఫ్జల్‌గురు ఉరిని న్యాయవ్యవస్థ హత్యగా అభివర్ణిస్తూ వారిద్దరు వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. జేఎన్‌యూ వివాదంపై ప్రధాని మోది మౌనం వీడాలని కన్హయ్య  కుటుంబసభ్యులు కోరారు.  

 ఆందోళనలో కశ్మీర్ విద్యార్థులు
 జేఎన్‌యూ సంఘటన అనంతరం పోలీసులు తరచూ ఇళ్లకు వచ్చి ప్రశ్నిస్తున్నారంటూ కశ్మీర్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆందోళనలో పాల్గొనని విద్యార్థులు కూడా భయంతో సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తున్నారని విద్యార్థి నేత షెహ్లా తెలిపారు.  

 గోమాంసం వార్త నిజం కాదు
 అలీగఢ్  ముస్లిం యూనివర్సిటీ క్యాంటిన్‌లో గోమాంసాన్ని వడ్డించారంటూ వచ్చిన ఆరోపణల్లో ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ఎలాంటి తప్ప జరగలేదని నిర్ధారించామని చెప్పారు.

Advertisement
Advertisement