మాయావతికి ముస్లింల మద్దతు తప్పనిసరి | Sakshi
Sakshi News home page

క్యాష్ చేసుకోవాలనుకుంటున్న మాయావతి!

Published Sat, Nov 5 2016 5:17 PM

మాయావతికి ముస్లింల మద్దతు తప్పనిసరి - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అధికార పక్షమైన సమాజ్‌వాది పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాలను బహుజన సమాజ్‌వాది పార్టీ సుప్రీం నాయకురాలు మాయావతి క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటివరకు సమాజ్‌వాది పార్టీతోనే ఉన్న ముస్లింలను తమ పార్టీవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో బలపడుతున్న భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే తమ పార్టీనే గెలిపించడమే ప్రత్యామ్నాయమని ఆమె ముస్లింలను కోరుతున్నారు.

2007 ఎన్నికల తర్వాత వరుసగా ప్రతి ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని కోల్పోతున్న బీఎస్పీ వచ్చే ఏడాదిలో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ముస్లింల మద్దతు తప్పనిసరి. రాష్ట్రంలో 22 శాతం దళితులు ఉండగా, 18 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 2007జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం 30.4 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చింది.

ఈసారి ఈ రెండు వర్గాలు కలిస్తే అప్పటికంటే ఎక్కువ శాతం ఓట్లతో గెలిచే అవకాశం ఉంటుంది. సమాజ్‌వాది పార్టీలో బాబాయి–అబ్బాయిల మధ్య ఏర్పడిన సంక్షోభ పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే ముస్లింలు బీఎస్పీ వైపు తిరిగే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ములాయం సింగ్‌ యాదవ్‌ జాతీయ ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసినట్లయితే ఇక ముందు కూడా సమాజ్‌వాది పార్టీతోనే ముస్లింలు వెళ్లాల్సి వస్తుంది.

2007లో అగ్రవర్ణమైన బ్రాహ్మణుల ఓట్లను కూడా సాధించడం వల్ల బీఎస్పీ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 2009లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో  ఆ పార్టీకి ఓట్ల శాతం 27 శాతానికి పడిపోయింది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 శాతం, 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో  19 శాతానికి పడిపోయింది. ఈసారి బ్రాహ్మణులెవరూ మాయావతి పార్టీకి ఓట్లు వేసే అవకాశం లేదు. వారంతా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలను తమ పార్టీ వైపు తిప్పుకోవడం మాయావతికి తప్పనిసరి.

2017లో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే చతుర్ముఖ పోటీ ఉంటుంది. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ములాయం అధ్వర్యంలో జాతీయ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడినట్లయితే దానికి అనుకూలంగా రాష్ట్రంలో కూడా ఎన్నికల పొత్తులు చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి.

Advertisement
Advertisement