మీ రాష్ట్రంలోనే అన్ని కుక్కలు ఎందుకున్నాయి: సుప్రీం | Sakshi
Sakshi News home page

మీ రాష్ట్రంలోనే అన్ని కుక్కలు ఎందుకున్నాయి: సుప్రీం

Published Thu, Oct 20 2016 7:35 PM

మీ రాష్ట్రంలోనే అన్ని కుక్కలు ఎందుకున్నాయి: సుప్రీం - Sakshi

దేవుడి సొంత భూమిగా పేరున్న కేరళలో కుక్కల బెడద ఎందుకంత ఎక్కువగా ఉందని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. నిజంగానే ఆ రాష్ట్రంలో సమస్య చాలా తీవ్రంగా ఉందని, వెంటనే వాటిని నియంత్రించకపోతే ప్రజాభద్రతకు చాలా తీవ్రమైన ముప్పు పొంచి ఉంటుందని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదించింది. తాను చాలా రాష్ట్రాలకు వెళ్లానని, ఒడిషాలో గానీ, అసోంలో గానీ అసలు వీధికుక్కల బెడద చాలా తక్కువగా ఉంటుందని.. కేరళలోనే ఇది ఎందుకంత తీవ్రంగా ఉందో మనం తెలుసుకోవాల్సి ఉందని జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. నిజంగా సమస్య అంత తీవ్రంగానే ఉంటే.. కుక్కల బాధితులకు పరిహారం కూడా చెల్లించాలని జస్టిస్ అమితవ్ రాయ్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. 
 
గుజరాత్‌లో కూడా ఈ సమస్య ఇంతే తీవ్రంగా ఉందని ఈ కేసులో కోర్టుకు అమికస్ క్యూరీగా సహకరిస్తున్న సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే చెప్పారు. కుక్కకాటు బాధితులందరికీ పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని, అది మొదలుపెడితే చాలామంది వస్తారని కేరళ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది వి.గిరి అన్నారు. ఢిల్లీలో ప్రతి ఆరు నిమిషాలకు ఒక కుక్కకాటు ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైందని మరో న్యాయవాది వీకే బిజు తెలిపారు. తన భార్య వీధికుక్క కాటు వల్ల చనిపోయిందంటూ పిటిషన్ దాఖలుచేసిన జోస్ సెబాస్టియన్ తరఫున ఆయన వాదిస్తున్నారు. కేరళలో మహిళలు, పిల్లలపై వీధికుక్కల కాట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. 
 
వీధికుక్కలకు కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టడం, రేబిస్ నియంత్రణ లాంటి చర్యలు చేపడితే కొంత ప్రయోజనం ఉంటుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో చెప్పాల్సిందిగా కోర్టులు కూడా అడిగాయని భారత జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యుబీఐ) తరఫున వాదించిన న్యాయవాది అంజలీశర్మ చెప్పారు. 

Advertisement
Advertisement