ప్రాసిక్యూషన్‌ ఎందుకు? | Sakshi
Sakshi News home page

ప్రాసిక్యూషన్‌ ఎందుకు?

Published Tue, Feb 27 2018 4:06 AM

Why the prosecution? - Sakshi

పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం.. శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకి తరలించేందుకు క్లియరెన్స్‌ వచ్చిందని యూఏఈలో భారత రాయబారి నవ్‌దీప్‌ సింగ్‌ సూరీ తెలిపారు. ఇందుకు దుబాయ్‌ అధికారులు అంగీకరించారని దుబాయ్‌లోని భారతమీడియాకు ఆయన ప్రకటించారు. అయితే కాసేపటికే పరిస్థితి మారిపోయింది. భారత మీడియాలో వార్తపై గల్ఫ్‌ న్యూస్‌ సూరీని సంప్రదించింది. అయితే.. పోస్టుమార్టం నివేదిక వచ్చినపుడున్న పరిస్థితుల ప్రకారం మృతదేహం తరలింపులో ఇక ఆలస్యం లేదన్నానని.. అయితే పోస్టు మార్టం నివేదిక వెల్లడవటం, అందులో శ్రీదేవి నీట మునిగి చనిపోయారని తెలియటంతో కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారని సూరీ తెలిపారు. దీని కారణంగా భౌతికకాయం తరలింపు మరింత ఆలస్యం కావొచ్చని ఆయన స్పష్టం చేశారు. దుబాయ్‌ అధికారులతో భారత దౌత్యకార్యాలయం నిరంతరం చర్చలు జరుపుతోందని.. వీలైనంత త్వరగా క్లియరెన్స్‌ సంపాది స్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ముంబైలో ఆమెను కడసారి చూసేందుకు ఎదురు చూస్తున్న వారు మరో రోజు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ అంటే?
దుబాయ్‌ చట్టాల ప్రకారం ఆసుపత్రి బయట ఎవరు చని పోయినా.. తప్పనిసరిగా పోస్టుమార్టం చేయటంతో పాటు ఫొరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించటం తప్పనిసరి. ఇందులో భాగంగానే శ్రీదేవి హోటల్‌ గదిలో మృతిచెందిన తర్వాత ఈ తంతు యథావిధిగానే కొనసాగింది. అయితే నివేదికలో అనుమానాస్పదంగా నీటమునిగి చనిపోయినట్లు వెల్లడవ టంతో విచారణ ముమ్మరం చేయటంతోపాటు కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు. ‘ఇలాంటి అనుకో కుండా మృతిచెందే కేసుల్లో పోస్టుమార్టం నివేదిక, ఫొరెన్సిక్‌ రిపోర్టులను పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేయటం సహజమే. ఇదంతా సాధారణ న్యాయ విధివిధానాల్లో భాగమే. ఈ రెండు రిపోర్టులను ప్రాసిక్యూటర్లు సమీక్షిస్తారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు భౌతిక కాయాన్ని అప్పజెబుతారు. అయితే.. కేసుల్లో ఏదైనా అనుమానాస్పదంగా ఉందని అనిపిస్తే ప్రాసిక్యూటర్లు విస్తృతమైన విచారణ జరుపుతారు. తదనుగుణంగా తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు’ అని చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ను ఉటంకిస్తూ గల్ఫ్‌ న్యూస్‌ పేర్కొంది. 

వివరాలు సేకరిస్తున్నాం: దుబాయ్‌ పోలీసులు
ప్రాథమిక విచారణ ప్రకారం శ్రీదేవి స్పృహకోల్పోయిన అనంతరం స్నానపుతొట్టిలో పడి చనిపోయారని దుబాయ్‌ పోలీసులు తెలిపారు. దీంతోపాటు ఫొరెన్సిక్‌ రిపోర్టులో.. శ్రీదేవి రక్తంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ‘ఘటన జరిగిన క్రమంపై విచారణ కొనసాగుతోంది. ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో నీటమునిగి చనిపోయారంటూ ఫొరెన్సిక్‌ నివేదికలో తేలింది. అలాగే.. ఘటనకు ముందు గదిలో ఏం జరిగిందనే దానిపై వివరాలు సేకరిస్తున్నాం’ అని దుబాయ్‌ పోలీసులు చెప్పినట్లు గల్ఫ్‌ న్యూస్‌ పేర్కొంది. ప్రమాదం ఎలా జరిగింది? అంతకు ముందు శ్రీదేవితో ఎవరెవరున్నారు? తదితర అంశాలపై కూపీలాగుతున్నారు.

స్తంభించిన బాలీవుడ్‌
శ్రీదేవి హఠాన్మరణంతో షాక్‌కు గురైన బాలీవుడ్‌ ఇంకా తేరుకోలేదు. నిత్యం ఏదో ఒక షూటింగ్‌తో బిజీగా ఉండే ముంబైలోని స్టూడియోలు రెండ్రోజులుగా తోటి నటీనటుల మౌనరోదనకు సాక్ష్యాలుగా నిలిచాయి. తోటి నటి ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేక.. చిత్రీకరణలో ఉన్న బాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చారు. దీంతోపాటుగా హోలీ సందర్భంగా జరిగే పలు ప్రత్యేక కార్యక్రమాలను కూడా రద్దుచేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

ప్రతి ఏడాది ఘనంగా హోలీ పార్టీని ఏర్పాటుచేసే షబానా అజ్మీ, జావెద్‌ అక్తర్‌ దంపతులు.. శ్రీదేవి మృతి నేపథ్యంలో ఈసారి వేడుకలను రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు, దర్శక నిర్మాత రాంగోపాల్‌ వర్మ కూడా తన తదుపరి చిత్రం పేరు, పోస్టర్‌ విడుదలను వాయిదా వేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అటు ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటున్న 102 నాటౌట్‌ సినిమా పాట చిత్రీకరణ కూడా రద్దయింది. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, రుషి కపూర్‌ నటిస్తున్నారు. శ్రీదేవి మృతికి గౌరవసూచకంగా షూటింగ్‌ వాయిదా వేసుకున్నట్లు చిత్ర దర్శకుడు వెల్లడించారు. 

అంత్యక్రియలకు తరలిరానున్న సినీలోకం
ముంబైలోని శాంతాక్రజ్‌ శ్మశానవాటికలో జరగనున్న శ్రీదేవి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు తరలివెళ్లనున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ నటీనటులంతా అనిల్‌ కపూర్‌ ఇంటికెళ్లి కపూర్‌ల కుటుంబానికి సంతాపం తెలిపారు. అక్కడే ఉన్న శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి, ఖుషిలను పరామర్శిస్తున్నారు. దక్షిణ భారత సినీ ప్రముఖులు, పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా ముంబై వెళ్లనున్నారు. 

శ్రీదేవి వైన్‌ మాత్రమే తీసుకుంటారు
శ్రీదేవి మద్యం మత్తులోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి తర్వాత నీటమునిగి చనిపోయారంటూ వస్తున్న వార్తలపై సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌ సింగ్‌ స్పందించారు. నటి కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘శ్రీదేవి హార్డ్‌ లిక్కర్‌ (బీర్, విస్కీ మొదలైనవి) తీసుకోరు. ఆమె వైన్‌ మాత్రమే తీసుకుంటారు. అది కూడా అప్పుడప్పుడే. నేను అబుదాబి షేక్‌ అల్‌ నహ్యన్‌తో మాట్లాడాను. అధికారిక తతంగమంతా త్వరగా పూర్తిచేసుకుని శ్రీదేవి భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా ముంబై పంపిస్తామని ఆయన భరోసా ఇచ్చారు’ అని అమర్‌ సింగ్‌ పేర్కొ న్నారు. అయితే శ్రీదేవితో సాన్నిహిత్యం ఉన్న మరికొందరు కూడా శ్రీదేవి ఈ స్థాయిలో మద్యం సేవించరని తెలిపారు.  

Advertisement
Advertisement