నెంబర్‌ గేమ్‌లో పటేల్‌ నెగ్గేనా..? | Sakshi
Sakshi News home page

నెంబర్‌ గేమ్‌లో పటేల్‌ నెగ్గేనా..?

Published Mon, Aug 7 2017 4:46 PM

నెంబర్‌ గేమ్‌లో పటేల్‌ నెగ్గేనా..? - Sakshi

ఢిల్లీ: గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ మరికొన్ని గంటల్లో జరగనున్న క్రమంలో కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచిన సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ విజయంపై ఉత్కంఠ నెలకొంది. గుజరాత్‌ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఎన్నికవనుండగా తగినంత సంఖ్యాబలం ఉండటంతో బీజేపీ నుంచి అమిత్‌ షా, స్మతీ ఇరానీ సులభంగా విజయం సాధించనున్నారు. మూడో అభ్యర్థిగా అహ్మద్‌ పటేల్‌ ఎన్నికపై కాం‍గ్రెస్‌లో కలవరం వ్యక్తమవుతున్నది. ఇద్దరు సభ్యులున్న ఎన్‌సీపీ మద్దతుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేత ప్రపుల్‌ పటేల్‌ ఎవరికి మద్దతు ఇవ్వాలనేదానిపై తామింకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడంతో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలినట్లైంది.

సీనియర్‌ నేత వాఘేలా మద్దతుదారులు రాజీనామా చేయడంతో కాం‍గ్రెస్‌ శిబిరంలో ప్రస్తుతం 44 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అహ్మద్‌ పటేల్‌ గెలవాలంటే ఆ పార్టీకి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ప్రత్యర్థికి ఓటు వేస్తారనే వార్తలూ కాంగ్రెస్‌ క్యాంప్‌లో కలకలం రేపుతున్నాయి. అహ్మద్‌ పటేల్‌ నెగ్గాలంటే ఎన్సీపీ మద్దతు అనివార్యం. మరి రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన పటేల్‌ గెలుపు కోసం ఎలాంటి కసరత్తు చేస్తారన్నది ప్రస్తుతం  ఆసక్తికరంగా మారింది.

మరోవైపు గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో  తన గెలుపు ఖాయమని  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలపై తనకు పూర్తి నమ్మకం ఉందని... క్రాస్‌ ఓటింగ్‌కు ఆస్కారమే లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు మెజార్టీ ఉందని తెలిసి మూడో అభ్యర్థిని బరిలో దించడం బీజేపీ దుర్నీతికి నిదర్శనమని  అహ్మద్‌ పటేల్ విమర్శించారు‌.

Advertisement
Advertisement