గంజాయిపై నిషేధం ఎత్తివేయాలా? | Sakshi
Sakshi News home page

గంజాయిపై నిషేధం ఎత్తివేయాలా?

Published Sat, Aug 5 2017 3:25 PM

గంజాయిపై నిషేధం ఎత్తివేయాలా?

న్యూఢిల్లీ: మత్తునిచ్చే మాదక ద్రవ్యాల గురించి మాట వినిపించినప్పుడల్లా గంజాయి గురించి గుర్తుకురాక తప్పదు. దమ్మారో దమ్‌...అంటూ గంజాయిని బిగించి కొడితే సుడులు, సుడులుగా వెలువడే పొగల మధ్య స్వర్గంలో తేలిపోతున్నట్లు, తూలి పోతున్నట్లు ఉంటుందని అంటారు అలవాటున్నవారు. వారి మాటను కాసేపు పక్కనే పెడితే నేడు క్యాన్సర్‌ను నయం చేయడంలో ఈ గంజాయి కీలక పాత్ర వహిస్తోన్నట్లు ప్రపంచవ్యాప్తంగా కొనసాగిన పలు పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్‌ రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు మాత్రమే గంజాయి మాత్రలు వాడగా, వారిలో ఆశ్చర్యంగా క్యాన్సర్‌ కణాలు నశించినట్లు వెల్లడైందని పలువురు డాక్టర్లు చెబుతున్నారు.

రోగుల్లో రకారకాల నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర వహించే గంజాయిని ఔషధంగా ఉపయోగించేందుకు గంజాయిని చట్టపరంగా అనుమతించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. జాతీయ ఔషధాల విధానంపై వచ్చేవారం జరుగనున్న మంత్రుల బందంలో ఈ అంశంపై చర్చ జరపనున్ననట్లు తెల్సిందే. ఈ నేపథ్యం గంజాయిని అనుమతించాలా, వద్దా?  అనుమతించడం వల్ల కలిగే లాభ నష్టాలేమిటీ? అన్న అంశాన్ని ముందుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కెనడా, ఉరుగ్వే, నెదర్లాండ్స్, రొమానియా దేశాలతోపాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో గంజాయిని చట్టపరంగా అనుమతిస్తున్నారు. భారత్‌లో కూడా 1985 వరకు గంజాయిని చట్టపరంగా అనుమతించేవారు.

గంజాయిని భారత్‌లో క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం నుంచి ఔషధాల్లో ఉపయోగిస్తున్న ఆధారాలు ఉన్నాయి. ఒళ్లు నొప్పులకు, మలేరియా నివారణకు చైనా చక్రవర్తి షెన్‌ నెంగ్‌ దీన్ని ఉపయోగించేవారట. చైనాలో పలు వర్గాల ప్రజలు దీన్ని తేనీరుగా సేవించేవారు. అదికాస్త ఆసియాలోని భారత్‌కు, ఆఫ్రికా దేశాలకు విస్తరించింది. భారత్‌లో కూడా ఆది నుంచి కండరాల నొప్పులకు, మానసిక ఒత్తిళ్లకు ఔషధంగానే గంజాయిని ఉపయోగించేవారు. ఆ తర్వాత ఉత్తర భారతంలో హోలి లాంటి పండుగల సందర్భంగా గంజాయి ఆకును బంగుతో పాలల్లో కలిపి సేవించేవారు. భారత దేశంలో హిప్పీ కల్చర్‌ కింద సిగరెట్ల ద్వారా గంజాయిని పీల్చే సంస్కతి పెరగడంతో గంజాయి సాగును, క్రయవిక్రయాలను నిషేధించారు. ఔషధాల్లో కూడా గంజాయి వినియోగాన్ని బాగా నియంత్రిస్తూ ‘నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాఫిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌–1985’ను తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఔషధాల్లో కూడా గంజాయి పాత్ర తగ్గిపోయింది. ఎందుకంటే ఈ చట్టం కింద మత్తునిచ్చే మందులను కొనుగోలు చేయాలంటే ఐదు రకాల లైసెన్స్‌ల తప్పనిసరి అయినవి. భారత్‌లో ఆరు రకాల మత్తు పదార్థాలను ఔషధాలుగా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉన్నప్పటికీ మార్ఫైన్, మెథలాన్, ఫెంటానిల్‌ లాంటి మూడు రకాల మత్తు మందులే అందుబాటులో ఉంటూ వచ్చాయి. దీంతో డ్రగ్స్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌ను 2014లో సవరించడంతో ఇతర డ్రగ్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి.

గంజాయిపై నిషేధం ఎత్తివేయాలా, వద్దా అన్న అంశంతో తనకు సంబంధం లేదని, క్యాన్సర్‌ రోగులకు ఉపయోగించేందుకు గంజాయి మందులు అందుబాటులో ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముంబైలోని టాట్‌ మెమోరియల్‌ సెంటర్‌ ఆస్పత్రి ప్రొఫెసర్‌ డాక్టర్‌ మేరి ఆన్‌ ముకాడన్‌ అభిప్రాయపడ్డారు. గంజాయిపై నిషేధం ఎత్తివేసినప్పుడే అది విరివిగా అందుబాటులోకి వస్తుందని, క్యాన్సర్‌ రోగుల చికిత్సలో గంజాయి ఓ గేమ్‌ ఛేంజర్‌ కాగలదని, ‘బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బెనిఫిట్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన డాక్టర్‌ సమీర్‌ కౌల్‌ అభిప్రాయపడ్డారు. వైద్య అవసరాలకు గంజాయిని అందుబాటులోకి తీసుకరావాలని, సామాజిక దుష్ఫలితాలున్నందున సమాజానికి గంజాయిని దూరం ఉంచాల్సిన అవసరం ఉందని కొంత మంది వైద్యులు అభిప్రాయపడ్డారు. నొప్పులను నయం చేయడంలో విశేషంగా పనిచేస్తున్న గంజాయి వల్ల సడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమిటో ఇంతవరకు తెలియదని, ముందుగా వాటిపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని మరి కొంత మంది వైద్యులు అభిప్రాయపడ్డారు. హాల్కహాల్‌లో ఉన్న అలవాటయ్యే గుణం కూడా గంజాయిలో తక్కువని, అలాంటప్పుడు హాల్కహాల్‌ను మాన్పించేందుకు గంజాయిని ఉపయోగించవచ్చని కూడా కొంత మంది డాక్టర్లు అభిప్రాయపడ్డారు. మాదకద్రవ్యాలు, హాల్కహాల్‌ లాంటి సామాజిక రుగ్మతుల నుంచి యువతను రక్షించేందుకు గంజాయిని అనుమతించవచ్చని సామాజిక శాస్త్రవేత్తలు కూడా వాదిస్తున్నారు.

Advertisement
Advertisement