ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తాం | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తాం

Published Sun, Dec 13 2015 10:14 PM

ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తాం

రాజ్‌నాథ్ స్పష్టీకరణ
 
 న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై  ఎన్డీఏ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం స్పష్టం చేశారు. భారత్‌ను పూర్తి సురక్షితమైన దేశంగా మార్చడానికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందన్నారు. 14 ఏళ్ల కిందట పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి పార్లమెంట్ ఆవరణలో నివాళి  సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని  దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఈ  దాడి మృతులకు ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబసభ్యులను మోదీ కలుసుకున్నారు.

 నేటితో పద్నాలుగేళ్లు: భారత పార్లమెంటు భవనంపై దాడి జరిగి ఆదివారానికి పద్నాలుగేళ్లు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా కారులో వచ్చిన ఐదుగురు లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థల ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ భవనంలోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులతో సమాధానం చెప్పాయి. కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి కాల్పుల్లో  ఆరుగురు పోలీసులు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Advertisement