మరణించిన 22 ఏళ్ల తర్వాత ప్రమోషన్ | Sakshi
Sakshi News home page

మరణించిన 22 ఏళ్ల తర్వాత ప్రమోషన్

Published Tue, Jul 8 2014 7:00 PM

Woman, 73, wins fight for husband's promotion 22 years after his death

మధురై: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఓ ప్రభుత్వోగి రిటైరయిన 25 ఏళ్ల తర్వాత, ఆయన మరణించిన 22 ఏళ్లకు  ప్రమోషన్ దక్కింది. ఆయన భార్య సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన తర్వాత సాధ్యమైంది. భర్తకు ప్రమోషన్ రావడం వల్ల ప్రయోజనమేంటంటే 73 ఏళ్ల వృద్దాప్యంలో ఆమెకు మరింత మొత్తం అందనుంది. తమిళనాడు రాష్ట్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

కన్యాకుమారి జిల్లాకు చెందిన రుసెలియన్ 1978-1980 మధ్య మెల్పురం యూనియన్ ఆఫీస్లో కమిషనర్గా పనిచేసేవారు. అప్పట్లో ఆయన అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో క్రమశిక్షణ చర్యల కింద ఆఫీసర్ స్థాయి ర్యాంక్కు డిమోట్ చేశారు. మూడేళ్లు అదే హోదాలో పనిచేశారు. 1983లో మరోసారి ఆయనను సస్పెండ్ చేశారు. ఆ మరుసటి ఏడాది సస్పెండ్ ఎత్తివేసి సేలంకు బదిలీ చేశారు. 1989లో రిటైరయిన రుసెలియన్ మూడేళ్ల తర్వాత మరణించారు. కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, డిమోషన్, సస్పెన్షన్ వలన తన కెరీర్కు నష్టం వాటిల్లినందున, న్యాయం చేయాలని కోరుతూ చెన్నైలోని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్లో ఆయన మరణించేముందు పిటిషన్ వేశారు. రుసెలియన్ మరణాంతరం ఆయన భార్య సరోజం న్యాయపోరాటం కొనసాగించారు. మద్రాస్ హైకోర్టుకు కూడా వెళ్లారు. చివరకు ఆమె పోరాటం ఫలించి భర్తకు ప్రమోషన్ దక్కింది. దీంతో ప్రస్తుతం నెలకు  12 వేల రూపాయిల పెన్షన్ అందుకుంటున్న సరోజంకు త్వరలో మరింత డబ్బు పొందనున్నారు.

Advertisement
Advertisement