మోదీ సభ.. మహిళా సర్పంచ్ కు అవమానం! | Sakshi
Sakshi News home page

మోదీ సభ.. మహిళా సర్పంచ్ కు అవమానం!

Published Wed, Mar 8 2017 6:44 PM

మోదీ సభ.. మహిళా సర్పంచ్ కు అవమానం! - Sakshi

గాంధీనగర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఓ మహిళా సర్పంచ్ కు చేదు అనుభవం ఎదురైంది. అది కూడా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో కావడం చర్చనీయాంశమైంది. తనకు జరిగిన అవమానంపై మహిళా సర్పంచ్ షాలిని రాజ్ పుత్ మీడియాతో మాట్లాడారు. తాను ఉత్తరప్రదేశ్, గౌతమ బుద్ధ నగర్ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్ నని, కొన్ని సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లాలని భావించినట్లు చెప్పారు. ఉమెన్స్ డే సందర్భంగా గాంధీనగర్ లో నిర్వహిస్తున్న స్వచ్ఛ్ శక్తి 2017 కార్యక్రమానికి మోదీ వస్తారని ఇంత దూరం కష్టపడి వచ్చానన్నారు.

ప్రధాని మోదీని కలిసేందుకు వేదిక సమీపానికి తాను చేరుకోగానే అక్కడున్న కొందరు సిబ్బంది తాను పక్కకు లాగిపడేశారని సర్పంచ్ షాలిని రాజ్ పుత్ ఆవేదనం వ్యక్తం చేశారు. మహిళా సర్పంచ్ అయినప్పటికీ తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను, తమ రాష్ట్ర (యూపీ) ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదన్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని ఎంతో ఆశతో వచ్చానన్నారు. అయితే తాను సర్పంచ్ నని, యూపీ నుంచి వచ్చానని చెప్పినా భద్రతా సిబ్బంది పట్టించుకోకుండా తనను వేదిక నుంచి దూరంగా ఈడ్చుకెళ్లారని మహిళా సర్పంచ్ తన ఆవేదనను వివరించారు.

మరోవైపు ఇదే కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. బాలికా శిశువుల భ్రూణ హత్యలను అసలు సహించకూడదని, మహిళా సర్పంచ్ లు ఇందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పడు మహిళా సర్పంచ్ ల ఆలోచనా శైలిలో ఎంతో మార్పు వచ్చిందని, క్లీన్ ఇండియాకు విశేష కృషి చేసిన మహిళా సర్పంచ్ లను గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని మోదీ పేర్కొన్న సభలోనే ఓ మహిళా సర్పంచ్ కు చేదు అనుభం ఎదురవడం గమనార్హం.

Advertisement
Advertisement